కన్నబిడ్డను బలిచేయబోయిన తల్లి..?
జయపురం: జయపురం ఇరిగేషన్ కాలనీలో ఒక తల్లి తన కన్నకుమార్తెను క్షుద్ర పూజలకు బలి చేయాలని చూసింది. స్థానికులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని బిడ్డను కాపాడారు. ఆ తల్లి అంబిక ఖోశ్ల ఓ వితంతువు. ఆమె స్థానిక ఇరిగేషన్ కాలనీలోని మారుమూల బస్తీలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఉంటోంది. కొన్ని రోజులుగా అంబిక తన ఇంటిలో క్షుద్ర శక్తికి, కాళికా మాతకు పూజలు చేస్తోంది. క్షుద్ర శక్తికి పూజలు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకించినా ఆమె వినలేదు. అంబిక మనస్తత్వం మరో విధంగా ఉండటం క్షుద్ర శక్తికి పూజలు చేయటం వల్ల ఆమె జోలికి ఎవరూ వెళ్లేవారు కాదు. అంబిక కాళీమాతకు పూజలు చేస్తుండగా ఆమె కుమార్తె నిఖిత చర్చ్‌కు వెళ్తూ బైబిల్ చదువుతుండేది. దీంతో ఆమె కుమార్తెను తీవ్రంగా వ్యతిరేకించేది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆ ఇంటి నుంచి కుమార్తె అరుపులు వినిపించాయి. అరుపులు విన్న ఆ వీధి వారు ఇంటికి వెళ్లి చూడగా నిఖిత అచేతనంగా పడి ఉంది. కాళ్లు చేతులు కట్టి ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రాగా నిఖితను పోలీసులకు అప్పగించారు. కుమార్తె చర్చికి వెళ్తోందనే అనుమానంతో ఆమెను బలి చేయాలని అంబిక తలిచి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పిల్లలు ఎక్కువగా ఉండే వీధిలో ఆమెను ఉంచడం ప్రమాదకరమని తెలిపారు. అనంతరం పోలీసులు నిఖిత తమ అదుపులో ఉంచుకున్నారు. నిఖితను విచారించాకే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.


