గురుభక్తిని చాటుకున్న శిష్యుడు
ఎచ్చెర్ల: తనకు డిగ్రీలో ఫిలాసపీ పాఠాలు బోధించిన గురువును గుర్తుంచుకున్న శిష్యుడు తాను రచించిన పుస్తకాన్ని గురువుకు అంకితమిచ్చారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న చీపురుపల్లి మండలం వంగపల్లిపేటకు చెందిన డాక్టర్ కె.హరీష్‌కిషన్ తాను రాసిన ‘పోర్ట్రయల్ ఆఫ్ విమెన్ ఇన్ ఠాగూర్’ అనే ఆంగ్ల పుస్తకాన్ని తన గురువు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిలాసపీ డిఫార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.వి.రాజుకు గరివిడిలోని ఆయన నివాసంలో ఆదివారం అంకితం జేశారు. ఈ సందర్భంగా హరీష్‌కిషన్ మాట్లాడుతూ తనతో పాటు వేలాది మందికి ఉన్నత చదువులకు ప్రేరణ ఇచ్చారని, పరిశోధనకు మార్గదర్శకులుగా వ్యవహరించారని పేర్కొన్నారు.
వరి కుప్ప దగ్ధంపై ఆరా
మెళియాపుట్టి : గిరిశిఖర గ్రామమైన కేరాసింగిలో చీడిగుడ్డి గవిరేసు అనే రైతుకు సంబంధించి రెండెకరాల వరికుప్ప కాలిపోయిన ఘటనపై మెళియాపుట్టి ఎస్సై రమేష్‌బాబు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైతుతో మాట్లాడి వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై గిరిజన గ్రామాల్లో ప్రజలు కలసిమెలిసి ఉంటారని, ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని అన్నారు. పంట చేతికొచ్చిన సమయంలో ఇటువంటివి జరిగితే రైతుకు శోకం మిగులుతుందన్నారు.
ఇంటర్‌విద్య ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిలా అధ్యక్షుడిగా జొన్న పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గురుగుబెల్లి రేవంత్‌కుమార్, కోశాధికారిగా పొన్నాడ వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడిగా కె.నరేష్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎస్.మధుబాబు, మహిళా కార్యదర్శిగా కె.యశోద, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.రాజశేఖర్, కార్యవర్గ సభ్యులగా బి.ప్రశాంత్, కె.మనోజ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పారావు, కమలాకర్, ఏపీ ఎన్‌జీవో సంఘం శ్రీకాకుళం నగర అధ్యక్షుడు బొత్స శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, పొందూరు తాలూకా సెక్రటరీ నర్సునాయుడు తదితరులు పాల్గొన్నారు.
భగవద్గీతతో జీవితం సార్థకం
శ్రీకాకుళం కల్చరల్ : మనిషి మనుగడకు భగవద్గీత ఎంతో ఉపకరిస్తుందని విశ్రాంత ఉపాధ్యాయుడు తుమరాడ జగన్నాథశాస్త్రి అన్నారు. నగరంలోని ఉపనిషన్మందిరంలో మానవ జీవితంలో భగవద్గీత అనే అంశంపై ఆదివారం ప్రవచనాలు చెప్పారు. భగవద్గీతలో కర్మ, భక్తి, మోక్ష యోగాల ఆవశ్యకతను వివరించారు. ప్రతి శ్లోకంలో ఐహిక జీవనానికి సంబంధం, సమస్య, సమాధానం తెలిపారు. జ్ఞానోపదేశం, శ్రవణ, మనన వినియోగం వల్ల జీవితం ఏ విధంగా సార్ధకమవుతుందో వివరించారు. అనంతరం వక్తను మందిర సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ నారాయణమూర్తి, డాక్టర్ కోమలరావు, నరసింహమూర్తి, విశ్వేశ్వరరావు, ఈశ్వరరావు, బాబూరావు, పట్నాయక్, వెంకటరావు, వెంకటరమణ, సూరిబాబు, పద్మావతి, సరస్వతి, అరుణ పాల్గొన్నారు.
విద్యార్థిని మృతితో
విషాదం
శ్రీకాకుళం రూరల్ : సింగుపురం గ్రామానికి చెందిన కొత్తకోట లాస్యశ్రీ (14) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. ఈమె కొన్ని నెలలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూరగాయలు వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
గురుభక్తిని చాటుకున్న శిష్యుడు
గురుభక్తిని చాటుకున్న శిష్యుడు
గురుభక్తిని చాటుకున్న శిష్యుడు


