యువకుడికి తీవ్ర గాయాలు
రణస్థలం : లావేరు మండలం బెజ్జిపురం జాతీయ రహదారిపై రణస్థలం వైపు నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న లావేటి నవీన్ అనే యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు.
శ్రీకూర్మంలో తిరుప్పావై
ప్రవచనాలు ప్రారంభం
గార: ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు సౌజన్యంతో తిరుప్పావై ప్రవచనాలు మంగళవారం సాయంత్రం ప్రత్యేక మంటపంలో ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు ప్రవచకులుగా ప్రారంభోనోపాస్యం చేశారు. ఇక్కడతో పాటు శ్రీకాకుళం నగరంలోని కోదండ రామాలయం, వేణుగోపాలస్వామి ఆలయంలోనూ ప్రవచనాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అదే విధంగా, మార్గశిర మాసం బహుళ ద్వాదశి మంగళవారం మధ్యాహ్నం నుంచి నెలగంట ప్రారంభమైందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, పదవీ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ 2026 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోగా తప్పనిసరిగా తమ జీవన ప్రమాణ పత్రాలు (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించాలని ఉప ఖజానా అధికారి చింతాడ రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళంలోని హెడ్ క్వార్టర్స్ ఉప ఖజానా కార్యాలయం పరిధిలో 6,790 మంది పింఛనుదారులు ఉన్నారని, వీరందరూ నెట్ సెంటర్లలోగానీ లేదా దగ్గరలోని ఖజానా కార్యాలయాల్లో గానీ జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా తమ పత్రాలను సమర్పించాలని ఆయన సూచించారు. అనారోగ్యం లేదా వృద్ధాప్యం కారణంగా బయోమెట్రిక్ నమోదు చేయలేని వారు సంబంధిత ఉప ఖజానా కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. అంతేకాక జీఓ 315 ప్రకారం పింఛను పొందుతున్న అవివాహిత మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న ఫ్యామిలీ పెన్షన్‌దారులు, ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు సంబంధిత పత్రాలతో నేరుగా శ్రీకాకుళం ఉప ఖజానా కార్యాలయాన్ని సంప్రదించి జీవన ప్రమాణ పత్రాలను సమర్పించాలని ఆయన తెలియజేశారు.
‘అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదు’
మందస: కార్గో ఎయిర్‌పోర్టుకు అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. భేతాళపురం గ్రామంలోని సచివాలయ ప్రాంగణంలో పలాస ఆర్డీఓ జి.వెంకటేశ్వరరావు కార్గో ఎయిర్‌పోర్టు బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అంగీకరిస్తే ప్రభుత్వం నుంచి లాంగ్ పూలింగ్ విధానం తీసుకువచ్చి ఎకరాకు 25 సెంట్లు భూమి తిరిగి ఇస్తామని, ఏ ఒక్కరి ఇళ్లకు నష్టం కలిగించకుండా ప్లాన్ చేశామని, జిరాయితీ తోటల్లో ఉన్నా చెట్లకు ప్రత్యేక ధర ప్రకటిస్తామని, ప్రభుత్వ ధర కంటే 2.5 రెట్లు అధికంగా చేసి ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పారు. అనంతరం రైతు మామిడి రాజేశ్వరి మాట్లాడుతూ ప్రాణాలైనా ఇస్తాం గానీ భూమి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కీలు గున్నమ్మ, బత్తిన ఉమాపతి, గార ఆనంద్ మాట్లాడుతూ భూములు ఇచ్చేస్తే భవిష్యత్ తరాల మనుగడ ఏమవుతుందని ప్రశ్నించారు. అంగుళం భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రైతు బత్తిన లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 23న భేతాళపురంలో సభ ఏర్పాటు చేసి భూమి ఇచ్చేది లేదంటూ తీర్మానం పంపిస్తామని తెలిపారు. పచ్చని ఉద్దానం భూములను నాశనం చేసే చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు.
యువకుడికి తీవ్ర గాయాలు
యువకుడికి తీవ్ర గాయాలు


