ఉత్సాహంగా మోడరన్ పెంటాథ్లెన్ పోరు
● రాష్ట్ర స్కూల్‌గేమ్స్ పోటీలకు భారీగా క్రీడాకారులు రాక
● విజేతలకు బహుమతులు ప్రదానం
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగిన రాష్ట్ర మోడరన్ పెంటాథ్లెన్ పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 69వ ఏపీ రాష్ట్రస్థాయి మోడరన్ పెంటాథ్లెన్ (రన్నింగ్, స్విమ్మింగ్) చాంపియన్‌షిప్ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–17, అండర్–19 విభాగాల్లో జరిగిన ఈ పోరులో అత్యద్భుతమైన ఆటతీరుతో బాలబాలికలు ఆకట్టుకున్నారు.
● అండర్–17 విభాగంలో 1600 మీటర్ల పరుగు, 50 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్స్, అండర్–19 విభాగంలో రెండు కిలోమీటర్ల పరుగు, 100 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్స్ నిర్వహించారు. పరుగుపందాలను కోడిరామ్మూర్తి స్టేడియంలో, స్విమ్మింగ్ పోటీలు శాంతినగర్‌కాలనీలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా నిర్వహించారు. విజేతలగా నిలిచిన బాలబాలికలకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు పి.సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, కె.మాధవరావు, టి.శ్రీనివాసరావు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.మెజారిటీ విజేతలు ఆతిథ్య జిల్లాకు చెందినవారు కావడం విశేషం.
విజేతలు వీరే
అండర్–17: బాలురు విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.వాసుదేవరావు, ఎ.మహేష్, జి.రమేష్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ఎ.సంతోషిని (శ్రీకాకుళం), బి.సాన్విత (కర్నూలు), జి.కావ్య (శ్రీకాకుళం) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.
అండర్–19: బాలురు విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.కార్తీక్, బి.ఉదయ్‌కుమార్, జి.ఉదయ్‌కిరణ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ఎన్.శ్రావణి(శ్రీకాకుళం), జి.జ్యోతిక (శ్రీకాకుళం), కె.కళ్యాణి (వైఎస్సార్ కడప) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
ఉత్సాహంగా మోడరన్ పెంటాథ్లెన్ పోరు
ఉత్సాహంగా మోడరన్ పెంటాథ్లెన్ పోరు


