చిత్ర లేఖన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం
జయపురం: జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు నవంబర్ 23వ తేదీన జిల్లాలోని వివిధ కోర్టులలో నిర్వహించిన చిత్ర లేఖన పోటీలలో విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం సభాగృహంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి బిష్టు ప్రసాద్ దేవత, జిల్లా జడ్జి, ప్రదీకరణ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోటీలలో జూనియర్ విభాగంలో జయపురం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని అపరాజిత మహాపాత్రో ప్రథమ, సైంట్ జాబియర్స్ పాఠశాల విద్యార్థి ఎన్.సాయి ద్వితీయ, బొయిపరిగుడ సమితి సిరిగుడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సమర మఝి తృతీయ బహుమతులు సాధించారు. సీనియర్ గ్రూపులో బొయిపరిగుడ సమితి సిరిబెడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి సురేంద్రచలాన్ ప్రథమ, జయపురం సమితి టంకువ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి గోపీనాథ్ బిశాయి ద్వితీయ, కొట్‌పాడ్ సరస్వతీ విద్యామందిర విద్యార్థి భిగ్న జిత్ బెహర తృతీయ బహుమతులను దక్కించుకున్నారు. వీరికి ముఖ్యఅతిథితో పాటు ఫ్యామిలీ కోర్టు జడ్జి నిశిత్ నిశంకో, జయపురం చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ పి.సుజాతలు మెమెంటోలతోపాటు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. బహుమతుల ప్రధాన ఉత్సవంలో జడ్జి స్వయం ప్రకాశ దాస్, సబ్ డివిజన్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ బారిక్, న్యాయ అధికారులు హరమణ దాస్, డాక్టర్ రౌత్ రాయ్, ప్రజ్ఞా సుమన్ మహాపాత్రో పాల్గొన్నారు.
చిత్ర లేఖన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం


