దశలవారీ పోరాటాలకు సిద్ధం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని యూనియన్ గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని కోరారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటు తక్షణమే విరమించాలన్నారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసి కార్మికులకు కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
కనీస వేతనం రూ.10వేలు, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తింపు, ప్రతి నెల 5లోపు వేతనాలు, బిల్లుల చెల్లింపు తదితర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. పెరిగిన ధరలకగుణంగా బడ్జెట్ పెంచాలన్నారు. రాజకీయ జోక్యం, అక్రమ తొలగింపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక తరహాలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు టి.ప్రవీణ, బి.కన్యాకుమారి, జయలక్ష్మి, పద్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు.


