చోరీ కేసులో ముద్దాయికి జైలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో ద్విచక్ర వాహనం చోరీ చేసిన కేసులో పట్టుబడిన ముద్దాయి గొల్లకంచిలి గ్రామానికి చెందిన డొక్కరి రవికి 8 నెలల జైలు శిక్షతోపాటు, రూ.1,000ల జరిమానా విధిస్తూ తీర్పు వచ్చిన ట్లు స్థానిక ఎస్‌ఐ పి.పారినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేట ఏజేఎంఎఫ్‌సీ జడ్జి కేసును విచారించిన తర్వాత ఈ మేర కు తీర్పు వెలువరిచినట్లు తెలిపారు. ఈ కేసు వాదనలో ఏపీపీగా పి.నరేష్, దర్యాప్తు అధికా రిగా తాను వ్యవహించినట్లు పేర్కొన్నారు.
సముద్రంలో మత్స్యకారుడు మృతి
సంతబొమ్మాళి: మండలంలోని భావనపాడు గ్రామానికి చెందిన కొమర రాజయ్య (63) అనే మత్య్సకారుడు శనివారం సముద్రంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలాగే రాజయ్య చేపల వేట కోసం సముద్రపు ఒడ్డుకు వెళ్లాడు. సముద్రపు ఒడ్డున ఒక కర్రను పాతి.. దానికి ఒకవైపు వలను కట్టాడు. మిగిలిన వలను కట్టడానికి సముద్రపు లోపలికి నడుచుకుంటూ వెళ్లాడు. సముద్రపు లోపల వల కడుతున్న సమయంలో పెద్దపెద్ద కెరటాలు రావడంతో ఆ వలలో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయాడు. ఇది చూసిన మత్య్సకారులు రాజయ్యను కాపాడే లోపే మృతి చెందడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నౌపడ ఎస్‌ఐ జి.నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి అస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
పొదల్లో నవజాత శిశువు మృతదేహం
కవిటి: మండలంలో కవిటి – గొండ్యాలపుట్టుగ రోడ్డు మార్గంలోని కొబ్బరితోటల పొదల్లో శనివారం ఉదయం నవజాత మగ శిశువు మృతదేహం కనిపించింది. వేకువజామున వాకింగ్‌కు వెళ్లే పాదచారులు గుర్తించి విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. దీంతో ఎస్‌ఐ వి.ర వివర్మ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహానికి ఖననం చేశారు.
ధాన్యం బస్తాలు దగ్ధం
టెక్కలి రూరల్: మండలంలోని బొరిగిపేట గ్రామం నుంచి మేఘవరం వైపు వెళ్లే మార్గంలో పొలంలో ఉంచిన చింతాడ బుడ్డు అనే రైతుకు సంబంధించిన ధాన్యం బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చినట్లు స్థానికులు తెలిపారు. పొలంలోని ధాన్యం బస్తాల్లో ఎక్కించి సుమారు 15 బస్తాల ధాన్యం పొలంలో ఉంచగా.. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి సమీపంలో ఉన్న గడ్డిని కాల్చడంతో ధాన్యం బస్తాలకు సైతం మంట అంటుకుంది. ఇది గుర్తించి స్థానికులు హుటాహూటిన మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే నాలుగు ధాన్యం బస్తాలు కాలిపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
లేబర్ కోడ్‌లు రద్దు చేయండి
శ్రీకాకుళం రూరల్: లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్ పిలుపునిచ్చారు. స్థానిక తంగివానిపేట గ్రామంలో శనివారం నిర్వహించిన ఐఎఫ్‌టీయూ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చారన్నారు. కార్పొరేట్ వ్యవస్థలు, బడా పెట్టుబడుదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేయడమే వీటి ఉద్దేశమని మండిపడ్డారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా సభ్యురాలు ఎస్.కృష్ణవేణి, ఎస్.అప్పన్న, నాగమణి, రమణ, లక్ష్మీ సుజాత పాల్గొన్నారు.


