కామ్రేడ్ కొండయ్య ఆశయ సాధనకు కృషిచేద్దాం
ఆమదాలవలస: సీఐటీయూ జిల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ మెట్ట కొండయ్య ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని కొత్తకోటవారి వీధిలో కొండయ్య స్వగృహం వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన సంస్మరణ సభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. 1970వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆవిర్భవించినప్పుడు జిల్లాలో ఆమదాలవలస చక్కెర కర్మాగారంలో దివంగత చాపర అప్పారావు, దిగుమర్తి విశ్వనాథం, మెట్ట కొండయ్య సీఐటీయూ యూనియన్‌ను ఏర్పాటు చేశారన్నారు. సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు వేతనాలు పెంచాలని, బోనస్ ఇవ్వాలని 56 రోజులపాటు నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా సమ్మె పోరాటాలు చేసి విజయవంతం చేశారని కొనియాడారు. సమ్మె కాలంలో కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, తన భార్య వద్ద ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి కార్మిక కుటుంబాలకు సహాయం చేసిన గొప్ప మానవతావాది అని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీ, కామ్రేడ్ కొండయ్య కుటుంబ సభ్యులు, సీఐటీయూ సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్, భవిరి కృష్ణమూర్తి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, సీనియర్ జర్నలిస్ట్ సువ్వారి మురళీధర్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పంచాది లతాదేవి, జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి జనార్ధనరావు, ప్రజా సంఘాల నాయకుడు బొడ్డేపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


