గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్టు
కంచిలి: ఒడిశా నుంచి ముంబాయికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనంతోపాటు 24 కిలోల 700 గ్రాముల గంజాయిని సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలోని కంచిలిలో ఎస్‌ఐ పి.పారినాయుడు, తన సిబ్బంది పట్టుకున్నట్లు సోంపేట సీఐ బి.మంగరాజు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా మోహన గ్రామ సమీపంలోని ఉదయగిరి గ్రామానికి చెందిన ఆర్.రాజు అనే వ్యక్తి వద్ద అదే జిల్లాలోని పనగుడి గ్రామానికి చెందిన మిలన్ మిచెన్ బిరా అనే వ్యక్తి 24 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అనంతరం శుక్రవారం రెండు బ్యాగుల్లో 24 ప్యాకెట్లను సర్ది, ముంబాయికి చెందిన శంకర్‌కి కోణార్క్ ట్రైన్‌లో వెళ్లి ఇవ్వడానికి తన ద్విచక్ర వాహనంపై వరుసకు పిన్ని అయ్యి దీపా లిమా అనే మహిళతో కలిసి కంచిలి రైల్వేస్టేషన్‌కు బయల్దేరాడు. అయితే అదే సమయంలో కంచిలి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ పి.పారినాయుడు తన సిబ్బందితో సోంపేట రైల్వేస్టేషన్ జంక్షన్‌లో వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని వీరిద్దరినీ అరెస్టు చేశారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించినట్లు సీఐ మంగరాజు తెలిపారు.


