రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రిలయన్స్ మార్ట్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మల్లిగాం గ్రామానికి చెందిన కూర్మారావు జిలకర (35)గా గుర్తించగా గాయాలు తగిలిన వారిలో అదే గ్రామానికి చెందిన బాబారావు హుయిక, తేజారావు హుయికలు ఉన్నారు. చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి స్థానిక రిలయన్స్ మార్ట సమీపంలో కూర్మారావు, బాబారావు, తేజారావులు మోటార్ సైకిల్ పార్కింగ్ చేసి దాని పక్కన నిలబడి ఉన్నారు. అదే సమయంలో జేకే పూర్ నుంచి వస్తున్న ఒక లారీ అదుపు తప్పి ఆగి ఉన్న మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో మోటార్ సైకిల్ పక్కనే ఉన్న ముగ్గురు తీవ్రగాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గాయాలు తగిలిన ముగ్గురినీ విశాఖపట్నం తరలించారు. అయితే మార్గమధ్యంలో కూర్మారావు మృతి చెందగా అతని మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారని, అందుకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు చికిత్స పొందుతున్న ఇద్దరికీ సంబంధించిన ఖర్చులు లారీ యజమాని భరించాలని డిమాండ్ చేస్తూ మల్లిగాం గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేశారు.


