తాత్కాలిక విరమణ
ప్రాథమిక ఉపాధ్యాయుల సమ్మె
● 7 రోజుల్లోపు స్పందించకుంటే
సామూహిక సెలవు హెచ్చరిక
భువనేశ్వర్: గత ఐదు రోజులుగా స్థానిక గాంధీ మార్గ్‌లో ఆందోళన చేస్తున్న ప్రాథమిక ఉపాధ్యాయులు బుధవారం తాత్కాలికంగా వైదొలిగినట్లు ప్రకటించారు. ఆందోళన ప్రాంగణంలో ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, కేంద్ర మాజీ మంత్రి విశ్వేశ్వర టుడుతో చర్చల తర్వాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు బుధవారం నుంచి అందరూ సెలవుపై వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఏకామ్ర ఎమ్మెల్యే బాబూ సింగ్, కేంద్ర మాజీ మంత్రి విశ్వేశ్వర టుడు ప్రభుత్వం తరఫున నిరసన స్థలానికి చేరి ఉపాధ్యాయుల డిమాండ్లను నెరవేర్చడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలియజేయడంతో నిరసనకారుల వర్గం తాత్కాలికంగా ఆందోళన నిర్మించేందుకు అంగీకరించింది. ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి నిరసన స్థలం నుంచి వెళ్లిపోయిన తర్వాత నిరసనకారుల మధ్య విభేదాలు తలెత్తాయి. వాదనలు, తోపులాటలు జరిగాయి. వారి మధ్య వాదులాట తోపులాటకు దారి తీసి ఆందోళన ప్రాంగణంలో యుద్ధ వాతావరణం నెలకొంది. నిరసనకు అనుమతి లేకపోయినా వారు ఆందోళన సృష్టిస్తుండటంతో పోలీసులు వారిని తరిమికొట్టడంతో నిరసన స్థలం నుంచి వైదొలిగారు. అనంతరం ప్రముఖ సభ్యులు అత్యవసరంగా సమావేశమై నిరసనను ఏడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని తీర్మానించారు. ప్రభుత్వం 7 రోజుల్లోగా డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రంలోని అందరు ఉపాధ్యాయులు ఏక కాలంలో సెలవుపై వెళ్తారని షరతు విధించారు. 2001 నుంచి పని చేస్తున్న ఉపాధ్యాయులకు 4200 గ్రేడ్ పే, ఆరు నామ మాత్రపు ఇంక్రిమెంట్లు డిమాండ్ చేస్తూ గత శుక్రవారం నుంచి ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం (నూతన పెన్షన్) సమ్మె చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు రాత్రింబవళ్లు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. 7వ తేదీన రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి అభ్యర్థించినప్పటికీ ఉపాధ్యాయులు నిరసన నుంచి వైదొలిగేందుకు నిరాకరించారు. ఉపాధ్యాయులు నిరసనలో చేరినప్పటి నుంచి ప్రాథమిక విద్యా డైరెక్టరేట్ అన్ని జిల్లా విద్యా అధికారులను నిరసనకు దిగిన ఉపాధ్యాయుల గురించి సమాచారం అందించాలని ఆదేశించింది. పోలీసుల అనుమతి లేనందుకు వారికి నోటీసులు కూడా జారీ చేసింది.


