ఎంవీ–26 గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు
మల్కనగిరి: కోరుకొండ సమితిలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం శాంతి కమిటీ ఏర్పాటుకు కృషి చేసింది. ఇరువర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన అధికారులు, రాజకీయ నాయకులు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం శాంతి కమిటీ ఏర్పాటు ద్వారా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆ క్రమంలో సన్నాహాలు మొదలుపెట్టింది. గత శుక్రవారం నాడు సమితిలోని రకూల్‌గుడ గ్రామానికి చెందిన లక్కీ పొడియాని అనే 55 ఏళ్ల వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు కొందరు దారుణంగా హత్య చేసి ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి మృతదేహాన్ని సమీపంలో గల పోటేరు నదిలొ పారేసిన సంగతి విధితమే. దీనిపై రకూల్‌గుడ గ్రామస్తులు పక్కనే ఉన్న ఎంవీ–26 గ్రామానికి చెందిన కొందరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని భావించి శనివారం నాడు గ్రామంలో ఆకస్మిక దాడులను చేసి కొన్ని ఇళ్లను దగ్ధం చేయగా మరి కొన్ని వాహనాలను తగుల బెట్టారు. దీంతో ఆ గ్రామంలొ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు గురైన మహిళ మృతదేహం లభించినప్పటికీ ఆమెకు సంబంధించిన తల లభించకపొవడంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఆమె తల సుమారు 40 కిలోమీటర్ల దూరంలో గల నదిలో లభించింది. దీనిని సేకరించిన పోలీసులు దక్షిణాంచల్ డిఐజి, ఇరువర్గాలకు చెందిన కొంతమంది ప్రతినిధుల సమక్షంలొ లభించిన తలను అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఎస్పీ వినోద్ పటేల్, కలెక్టర్ సొమేష్ ఉపాధ్యాయ నేతృత్వంలో బుధవారం నాడు శాంతికమిటీకి సన్నాహాలు చేశారు. సమావేశంలో చిత్రకొండ ఎమ్మెల్యే మంగు కిలొ, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నరసింగ్ మడ్కామి లతొ పాటు ఆ ప్రాంత ప్రముఖులు, ఇరువర్గాల ప్రతినిధులతో సమావేశమై శాంతి కమిటీని ఏర్పాటు చేశారు.
ఎంవీ–26 గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు


