రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం, అలవెన్సులు పెంపు
భువనేశ్వర్: రాష్ట్రంలోని ఎమ్మెల్యేల జీతం, భత్యాలు పెరుగుతాయి. మాజీ ఎమ్మెల్యేల ఫించను కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. మంగళ వారం శాసన సభ వ్యవహారాల విభాగం మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ శాసన సభ్యులు, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మరియు మాజీ ఎమ్మెల్యేల జీతం, భత్యాలు, పింఛన్‌కు సంబంధించిన ఈ ముఖ్యమైన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ జీతం రూ. 40,500 నుంచి రూ. 98,000కి, సమావేశం భృతి రూ. 800 నుంచి రూ. 2,000 కు పెంచారు. కార్ అలవెన్స్ నెలకు రూ.17,000 నుంచి రూ.89,000 కు, వ్యక్తిగత ఖర్చుల అలవెన్స్ రూ. 40,000 నుంచి రూ.1,81,000 కు పెంచారు. వసతి భత్యం నెలకు రూ.100 నుంచి రోజుకు రూ. 2,000 కు పెంచారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జీతభత్యాల బిల్లు ప్రకారం ఎమ్మెల్యే మరణిస్తే అతని కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇక నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతం, భత్యాలు, పెన్షన్ పెంచుతారు. దీని ప్రకారం శాసన సభలో బిల్లు రూపంలో తీసుకురాకుండానే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతం, భత్యాలు మరియు ఫించను నేరుగా ఆర్డినెన్స్ ద్వారా పెంచవచ్చు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పింఛన్‌కు రూ. 30,000 నుంచి రూ. 80,000కి పెంచారు. పలుమారులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై న వారికి అదనంగా రూ. 3000 ఫించను అందుతుంది. మాజీ ఎమ్మెల్యేలకు ప్రయాణ ఖర్చుల కోసం రూ.12,000, వైద్య ఖర్చుల కోసం రూ. 2,000 బదులుగా రూ. 2,500 లభిస్తుంది.
డిప్యూటీ స్పీకర్ జీతభత్యాలు
డిప్యూటీ స్పీకర్ నెలవారీ జీతం రూ. 38,000 కు బదులుగా రూ. 94,000 అవుతుంది. సమావేశ భత్యం రూ. 800 కు బదులుగా రూ. 2,000కి పెరుగుతుంది. కారు భత్యం రూ. 17,000 కు బదులుగా రూ. 85,000 అవుతుంది. వ్యక్తిగత భత్యం రూ. 40,000 కు బదులుగా రూ. 1,77,000 అవుతుంది. తాజా బిల్లు ఆమోదంతో సరికొత్తగా వసతి భత్యం ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం ఎమ్మెల్యేలకు రోజుకు రూ. 2,000 లభిస్తుంది.
వాహన ప్రయాణ ఖర్చులు పెంపు
రాష్ట్రం వెలుపల జరిగే సమావేశాలకు రోజుకు రూ.2,000కి బదులుగా రూ. 10,000 పొందుతారు. రాష్ట్రంలోపు కారు ప్రయాణానికి కిలో మీటరుకు రూ. 25కి బదులుగా రూ.35, నెలవారీ రవాణా భత్యం రూ.15,000కి బదులుగా రూ.50,000 లభిస్తుంది. పుస్తకాలు కొనుగోలు చేసినందుకు నెలకు రూ. 2,000కి బదులుగా రూ.10,000 లభిస్తుంది. విద్యుత్ బిల్లులకు రూ. 5,000కి బదులుగా రూ. 20,000, వైద్య ఖర్చులకు రూ.5,000కి బదులుగా రూ. 35,000 లభిస్తాయి. క్వార్టర్లు ఇవ్వని ఎమ్మెల్యేలకు వసతి కోసం రోజుకు వెయ్యి రూపాయలకు బదులుగా రెండు వేల రూపాయలు, వాహనం కొనడానికి ఐదు లక్షలకు బదులుగా పది లక్షల రూపాయలు లభిస్తాయని తెలిసింది.


