నకిలీ యాప్‌తో రూ. 10 లక్షలు లాగేశారు!
జయపురం: నకిలీ యాప్‌తో బ్యాంక్ అకౌంట్ల నుంచి పది లక్షల రూపాయలు కాజేశారు. ఈ సంఘటన జయపురంలో చర్చనీయాంశమైంది. జయపురం వాసులు సదానంద సామంతరాయ్, కె.వెంకటేశ్‌ల బ్యాంక్ అకౌంట్ల నుంచి సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్ ద్వారా డబ్బు దొంగిలించినట్లు ఆరోపణ. దుండగులు సదానంద అకౌంట్ నుంచి రూ. 8.97 లక్షలు, కె.వెంకటేశ్ అకౌంట్ నుంచి రూ. 1.83 లక్షలు మాయం చేశారు. బాధితులు ఇరువురికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్‌లు ఉన్నాయి. వారి అకౌంట్ల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేసినట్లు వారు జయపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జయపురం సమితి టంకువ గ్రామం పంచాయతీ తొరిడిపుట్ గ్రామంలోని పాఠశాలలో సదానంద సామంతరాయ్ పనిచేస్తున్నారు. అతడు కేన్సర్ వ్యాధికి గురయ్యారు. అతడికి ఈ నెల పదో తేదీన ఆపరేషన్ చేసేందుకు విశాఖలోని ఆస్పత్రి వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ కోసం అతడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ. ఐదు లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ నెల ఏడో తేదీన అతను విశాఖపట్నంలో ఉన్న సమయంలో సదానంద ఫోన్‌కు ఒక యాప్ వచ్చింది. యాప్ డౌన్‌లోన్ చేసిన కొన్ని నిమిషాలలో అతడి అకౌంట్ నుంచి రూ. 8.97 లక్షలు మాయమయ్యాయి. వెంటనే సదానంద విశాఖ నుంచి జయపురం వచ్చి బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బ్యాంక్ వారు అతడి అకౌంట్‌ను లాక్ చేశారు. వెంటనే వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదానంద సోదరుడు సంతోష్ సామంతరాయ్ కొరాపుట్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అలాగే వ్యాపారి కె.వెంకటేశ్ రూ. 1.83 లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. సోమవారం అతని మొబైల్‌కు ప్రాంతీయ ట్రాన్స్‌ఫోర్టు కార్యాలయం నుంచి ఫేక్ యాప్ అప్లికేషన్ వచ్చింది. వెంకటేశ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయగా కంపెనీ ఓటీపీ అడిగింది. వెంకటేశ్ ఓటీపీ చెప్పకుండా మిన్నకున్నాడు. అనుమానం వచ్చి మంగళవారం టంకువ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ పరిశీలించగా రూ. 1.83 లక్షలు మాయమైనట్టు అయినట్లు వెల్లడైంది.


