మహానది జల వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
భువనేశ్వర్: దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న మహానది జలాల పంపిణీ వివాదం పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. మహానది జలాల కోసం ఉభయ చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహానది ఎగువ భాగంలో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అనధికారిక బ్యారేజీలు తదితర కట్టడాలు చేపట్టి దిగువ ఒడిశా ప్రాంతాలకు అన్యాయం చేసిందని ప్రధాన ఆరోపణ. ఈ వివాదాన్ని సామరస్యంగా తెర దించేందుకు ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన మహానది జల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ పార్టీ చీఫ్, అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్ మరియు కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు వంతున ముగ్గురు ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. మహానది జలాలకు సంబంధించిన అన్ని సంబంధిత అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలో మంత్రులు సురేష్ కుమార్ పూజారి, పృథ్వీరాజ్ హరిచందన్, సంపద స్వంయి, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్, ఎమ్మెల్యేలు నిరంజన్ పూజారి (బీజేడీ), జయనారాయణ మిశ్రా (బీజేపీ), సోఫియా ఫిర్దౌస్ (కాంగ్రెసు) సభ్యులుగా ఉన్నారు.


