హక్కుల పరిరక్షణతో సామాజికాభివృద్ధి
భువనేశ్వర్: సమిష్టి నిబద్ధతతో మానవ హక్కులను పరిరక్షించుకోవాలని వక్తలు అన్నారు. ఈ హక్కులు కేవలం చట్టాల ద్వారా మాత్రమే కాకుండా పౌరులు, సంస్థలు, సంఘాలు చురుకై న భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో ఫలప్రదం అవుతాయని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి. ఒడిశా మానవ హక్కుల కమిషన్ సంబల్‌పూర్ తపస్విని హాల్‌లో బుధవారం నిర్వహించిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం –2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి. వివక్షకు సమాజంలో చోటు లేకుండా ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే అవకాశం ఉండాలని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు. ఈ ఏడాది మానవ హక్కులు: మన రోజువారీ అవసరాలు అనే ఇతివృత్తం విద్య, స్వేచ్ఛపూర్వక భావ వ్యక్తీకరణ, సురక్షితమైన పని పరిసరాలు, ఆహారం, నీరు, ఆరోగ్యం మరియు భద్రత వంటి హక్కులు మానవ గౌరవానికి బలమైన పునాదిగా ప్రతిబింబిస్తుంది. మానవ హక్కులు తిరస్కరించబడితే సమాజం యొక్క ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు.1948లో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (యూడీహెచ్‌ఆర్) మానవ నాగరికతలో ఒక మలుపు. ప్రతి వ్యక్తికి గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయాన్ని ధృవీకరించింది. ఈ దిశలో ఐక్యరాజ్య సమితి కృషిని ప్రశంసించారు. యూడీహెచ్‌ఆర్ ముసాయిదాను రూపొందించడంలో మన దేశం వర్ణవివక్ష వంటి సమస్యలను ప్రారంభంలోనే లేవనెత్తి మహిళా ప్రాతినిథ్యం ప్రాముఖ్యతని ప్రతిపాదించి ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ప్రధాన భాగస్వామిగా కొనసాగిందని గుర్తు చేశారు. ఆహార భద్రత, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు మరియు దివ్యాంగులకు ప్రాప్యతను నిర్ధారించే పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను బలోపేతం చేసిందన్నారు. జల్ జీవన్ మిషన్, పీఎంజీకేఏవై, పీఎంఏవై ఆయుష్మాన్ భారత్ మరియు సుగమ్య భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు లక్షలాది మంది జీవన నాణ్యతను మెరుగుపరిచాయని పేర్కొన్నారు. జస్టిస్ శత్రుఘ్న పూజాహరి ఆధ్వర్యంలో ఒడిశా మానవ హక్కుల కమిషన్‌సత్వర ఫిర్యాదుల పరిష్కారం మరియు బలహీన వర్గాలను రక్షించడానికి ప్రయత్నాలను ప్రశంసించారు. ఆహార భద్రత, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత మరియు గిరిజన సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తార్కాణంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒడిశా మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, జస్టిస్ శత్రుఘ్న పూజాహరి, మానవ హక్కుల కార్యకర్త మరియు రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజ్వాడ విల్సన్, మాజీ డీజీపీ మరియు ఒడిశా పబ్లిక్ సర్వీసు కమిషను చైర్మన్ డాక్టర్ సత్యజిత్ మహంతి, ఒడిశా మానవ హక్కుల కమిషన్ సభ్యుడు అసిమ్ అమితాబ్ దాస్, మానవ హక్కుల కమిషన్ సభ్యుడు చిత్తరంజన్ మహా పాత్రో ప్రసంగించారు.
హక్కుల పరిరక్షణతో సామాజికాభివృద్ధి


