నేడు సెంచూరియన్ వర్సిటీలో..వెటర్నరీ టెక్నో కల్చరల్ ఈవ
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో గురువారం వెటర్నరీ టెక్నో కల్చరల్ ఈవెంట్ (వెటోరియా– 2025) పేరిట పశుసంవర్థక, జంతుశాస్త్ర స్కూల్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సెమినార్ నిర్వహించనున్నారు. ఈ మేరకు డీన్ డాక్టర్ ప్రొఫెసర్ గిరీష్ మహంతి తెలియజేశారు. ముఖ్య అతిథులుగా తీర్థకుమార్ దత్త, వైస్ చాన్సలర్ బిశ్వజిత్ మిశ్రా, అజయ్‌కుమార్ నాయక్ హాజరవుతారన్నారు.
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ గాంధీ పబ్లిక్ స్కూల్‌లో బుధవారం ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీల్లో 67 మంది మహిళలు పాల్గొని వివిధ వర్ణాలతో ముగ్గులు వేసి అందరిని ఆకట్టుకున్నారు ప్రథమ బహుమతిని బి.సుక్షమ రెడ్డి, ద్వితీయ బహుమతిని మహేశ్వేత మహాంతి, తృతీయ బహుమతిని భక్తి దాస్, మీనాక్షి పండాలు గెలుపొందారు. పబ్లిక్ స్కూల్ అధ్యక్షులు సుభ్రత్ రంజన్ విజేతలకు బహుమతులు అందజేశారు. సంప్రదాయాలను రక్షించుకోవడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు.
భువనేశ్వర్: రాష్ట్రంలో దృష్టి లోపం క్రికెటర్లకు వెన్ను తట్టి ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో పేరొందిన హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి వర్గం ముందుకు వచ్చింది. హైటెక్ 22 మంది దృష్టి లోపం ఉన్న బాలురు, బాలికలకు ఉచిత ఆహార, హాస్టల్ వసతిని కల్పించడంతో క్రికెట్ అభ్యాసం, సాధన కోసం మైదానాన్ని కల్పిస్తుందని హైటెక్ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ప్రకటించారు. స్థానిక హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి సముదాయంలో బుధవారం ఏర్పాటు చేసిన నిరాడంబర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన నలుగురు దృష్టి లోపం మహిళలు ఫుల్ సొరేన్, బాసంతి హంసద, యమునా రాణి టుడు, పార్వతి మరాండి, ఒడిశా అంధుల క్రికెట్ జట్టు సారథి మహ్మద్ జాఫర్ ఇక్బాల్‌కు రూ. 20,000 వంతున నగదు పురస్కారంతో ప్రత్యేకంగా సత్కరించారు. క్రీడల నుంచి విరమణ పొందిన క్రికెటర్లకు హైటెక్‌లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాయగడ: జిల్లాలోని మునిగుడలో ఉన్న పీడబ్ల్యూడీ కార్యాలయం ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్‌పీఎఫ్ బ్యారక్ బుధవారం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పు కోస్తా రైల్వే ఐజీ అలోక్ బెహర ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యారక్ పరిసరాల్లో మొక్కలను నాటారు. కార్యక్రమంలో సంబల్‌పూర్ రైల్వే డివిజన్ డీఎస్పీ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రైల్వే సిబ్బందితో మాట్లాడారు.
రాయగడ: క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని ఏబీడీవో కాళూచరణ్ నాయక్ అన్నారు. స్థానిక గాయత్రీనగర్‌లోని సరస్వతి శిశుమందిర్ విద్యాలయం వార్షిక క్రీడోత్సవాలు రైల్వే మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి కబరిచేలా పిల్లలకు పాఠశాలల యాజమాన్యాలు దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, విద్యాలయం పరిశీలన కమిటీ సాధారణ కార్యదర్శి ప్రమోద్ కుమార్ మహాంతి, కోశాధికారి మనోజ్ కుమార్ చౌదరి, ప్రధానోపాధ్యాయులు మనోరంజన్ దాస్ పాల్గొన్నారు.
రాయగడ: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో గల 18, 19 వార్డుల మధ్య గల ఒక స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని అనధికారికంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మున్సిపాలిటీ యంత్రాంగం స్పందించింది. కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం వార్డుల్లో సందర్శించి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆక్రమణ కట్టడాన్ని జేసీబీతో కూల్చివేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం మున్సిపాలిటీకి చెందినదిగా బోర్డును ఏర్పాటు చేశారు. ఈ విషయమై మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ మాట్లాడుతూ గత కొన్నాళ్ల క్రితం ఆయా వార్డుల్లో గల మున్పిపాలిటీకి చెందిన స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని తాత్కాలికంగా మందిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆదేశాల ప్రకారం ఆక్రమ కట్టడాన్ని తొలగించామన్నారు. రహదారిని నిర్మించేందుకు సన్నహాలు చేస్తున్నామని వివరించారు.


