రాయగడలో చొయితీ క్రీడోత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక రిలియన్స్ బంక్ కూడలి నుంచి బుధవారం ఉదయం మారధాన్ రేస్‌ను ప్రారంభించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా క్రీడాధికారి షేక్ ఆలీనూర్, ఏడీఎం నిహారి రంజన్ కుహరో, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్ర కాంత్ మాఝి, జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులనుద్దేశించి అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్ మాట్లాడారు. ఏటా చొయితీ ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. అదేతరహా ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుందని.. అందుకు అంతా సహకరించాలని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు ఇదే చక్కని వేదికగా భావించి క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని అన్నారు. పది కిలోమీటర్ల నిడివి గల హలువ తోట వరకు ఈ మారధాన్ రేస్ నిర్వహించడం జరిగిందని అన్నారు. పోటీల్లో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. యువకుల విభాగంలొ శ్రీకాంత్ ప్రస్కా ప్రథమ, రంజన్ ధొని ద్వితీయ, బలభద్ర హికక తృతీయ బహుమతిని గెలుపొందారు. ప్రొత్సాహక బహుమతులను మనోజ్ కుమార్ నాయక్, కంసం మాఝిలు సంపాదించుకున్నారు. యువతుల మధ్య జరిగిన పోటీల్లొ లలిత తాయాక ప్రథమ, సమీరా మాఝి ద్వితీయ, పింకి హిమిరక తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. ప్రొత్సాహక బహుమతిని సౌమ్యశ్రీ మాఝికి అందజేశారు.
రాయగడలో చొయితీ క్రీడోత్సవాలు ప్రారంభం


