ఆదివాసీల సంప్రదాయాలను పరిరక్షిస్తాం
డొంగిరియా మహిళల సంప్రదాయ నృత్యం
రాయగడ: భిన్న సంస్కృతులు గల మన రాష్ట్రంలో ఆదివాసీల సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, వాటిని పరిరక్షించేందుకు చొయితీ పేరిట లొకమహోత్సవం ఉత్సవాలను జిల్లా యంత్రాంగం నిర్వహించి, ప్రోత్సాహిస్తోందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో మంగళ, బుధవారాల్లో జరిగిన సమితి స్థాయి చొయితీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్యాణసింగుపూర్ సమితి పరిధిలో గల నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదిమ తెగకు చెందిన డొంగిరియాల భాష, వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. కొండల్లో, కోనల్లో నివసించేవారు కేవలం వారి ప్రాంతాలకే పరిమితమయ్యేవారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారిలో కొత్త ఆశలను నింపాయన్నారు. ప్రస్తుతం వారు కట్టు, బట్టలో ఎంతో చైతన్య వంతులయ్యారని, అదేవిధంగా స్వయం ఉపాధి మార్గాలు వెతుకులాటలో ముందుకు వెళుతున్నారని, ఇది మనకు ఎంతో ఆనందించే విషయమని అభిప్రాయపడ్డారు. పర్వత ప్రాంతాల్లో నివసించే డొంగిరియాల్లో నేడు యువత అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని, విద్యావంతులు కూడా ఉన్నారన్నారు. విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించే స్థాయికి చేరుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం వివిధ సంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, డొంగిరియా తెగకు చెందిన మహిళల నృత్యాలు వారి చైతన్యానికి మార్గదర్శకాలుగా నిలిచాయి. బీడీఓ మీనాక్షి దాస్ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాల్లో జిల్లా పరిషత్ సభ్యులు బరాటం ప్రసాద్ రావు, కందకులం సమితి అధ్యక్షుడు జొగేంద్ర వడక తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకర్షించాయి.


