ఢెంకనాల్ తహసీల్దార్ కారు జప్తు
● భూమి పరిహారం చెల్లింపు జాప్యం
భువనేశ్వర్: భూసేకరణ పరిహారం చెల్లించకపోవడంతో న్యాయస్థానం అసాధారణమైన చర్యల అమలుకు ఆదేశించింది. న్యాయ స్థానం ఆదేశాలతో ఢెంకనాల్ తహసీల్దార్ కార్యాలయం ఫర్నిచర్, అధికారిక ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో బొలేరొ వాహనం జప్తు చేశారు. బాజిచౌక్‌కు చెందిన సత్యబాది బెహరా దాఖలు చేసిన పిటిషన్ విచారణ పురస్కరించుకుని ఢెంకనాల్ సివిల్ జడ్జి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. బాజిచౌక్ సమీపంలోని పిటిషనర్‌కు చెందిన 12 దశాంశాల (డెసిమల్) భూమిని ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణం కోసం స్వాధీ నం చేసుకున్నారు. దీని కింద అతనికి రూ. 6 లక్షల పరిహారం చెల్లించాల్సింది. ఈ మేరకు పరిహారం ముట్టకపోవడంతో సముచిత చెల్లింపు అభ్యర్థనతో బాధిత పిటిషనరు 2013లో న్యాయ స్థానానికి ఆశ్రయించాడు. విచారణకు స్వీకరించిన న్యాయ స్థానం పూర్వాపరాలు పరిశీలించిన మేరకు 2023 సంవత్సరంలో సివిల్ జడ్జి భూమి యజమానికి వడ్డీతో సహా రూ. 13 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదు. బాధితునికి పరిహారం మొత్తం చెల్లించలేదు. ఇంతలో భూ యజమాని కన్నుమూయడంతో అతని కుమారుడు ప్రమోద్ బెహరా న్యాయ స్థానానికి వాస్తవ పరిస్థితిని వివరించడంతో ఘాటుగా స్పందించింది. ఈ అభ్యర్థనపై చర్య తీసుకుంటూ భూసేకరణ అధికారి, తహసీల్దార్ నిర్లక్ష్య వైఖరి నేపథ్యంలో అధికారిక కార్యకలాపాలకు వినియోగించే ప్రభుత్వ చరాస్త్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల ఆధారంగా బుధవారం అధికారులు తహసీల్దార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ బొలెరో వాహనం, బీరువా, కంప్యూ టర్, టేబుల్, కుర్చీలు, ఇతర కార్యాలయ ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్య తీవ్ర కలకలం రేపింది. ఢెంకనాల్ సివిల్ జడ్జి ఆదేశాలు వాస్తవ కార్యరూపం దాల్చడంతో బాధితునికి భూ పరిహా రం కింద న్యాయ స్థానం ఆదేశించిన మొత్తం చెక్ రూపంలో విడుదల చేశారు.


