ధాన్యం, మొక్కజొన్న మండీలు ఏర్పాటు చేయాలి
జయపురం: ధాన్యం, మొక్కజొన్నలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని, వెంటనే మండీలు తెరచి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా కృషక్ మంచ్ కార్యదర్శి నరేంద్ర కుమార్ ప్రదాన్ నేతృత్వంలో పలువురు మంచ్ సభ్యుడు బుధవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ ప్రదాన్ పత్రికల వారితో మాట్లాడుతూ ధా న్యం నూర్పులు పూర్తయి రైతులు ధాన్యం అమ్మేందుకు మండీల కోసం వేచి ఉన్నారని వెల్లడించారు. ఏ రోజు మండీ ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, మండీలు ప్రారంభానికి రెండు రోజుల ముందు టోకెన్ అందజేయాలన్నారు. ధాన్యం కొనుగోలు సంస్థలు, మిల్లు యజమానులు, సివిల్ సప్‌లై కార్పొరేషన్ విభాగం ప్రతినిధులు రైతులకు గోనె సంచులను సమకూర్చాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం అమ్మి కొనుగోరుదారుల గోనెలలో నింపి తమ గోనులు తీసుకెళ్తారని వెల్లడించారు. మండీల్లోనే ధాన్యం తూకం వేయాలని తూకం మేరకు రైతులకు రశీదులు ఇవ్వా లని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభు త్వం క్వింటా ధాన్యానికి రూ.69 పెంచిందని గుర్తుచేశారు. ఈ మేరకు పెంచిన ధరలో రైతుల నుంచి ధాన్యం కొనా లని నరేంద్రకుమార్ ప్రదాన్ డిమాండ్ చేశారు. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. నేటికీ మండీలు ప్రారంభించక పోవటంతో క్వింటా ధాన్యం రూ.1,600, మొక్కజొ న్న క్వింటా రూ.1,700 రైతులు విక్రయిస్తున్నారని వెల్లడించా రు. క్వింటా ధాన్యం వద్ద రూ.1500, క్వింటా మొక్కజొన్న వద్ద రూ.800 రైతులు నష్ట పోతున్నారని వివరించారు. రైతు సమ్యలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించి సమస్యలను పరిష్కరించాలన్నారు. రబీ పంటలకు సకాలంలో అప్పర్ కొలాబ్, తెలింగరి సాగునీటి ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడవాలని, అవినీతికి పాల్పడుతున్న మహిళా స్వయం సహాయక గ్రూపులను ధన్యం కొనే బాధ్యతల నుంచి తప్పించాలని వినతిపత్రంలో డిమాండ్ చేసినట్లు జిల్లా కృషక్ మంచ్ కార్యదర్శి నరేంద్రకుమార్ ప్రధాన్ వెల్లడించారు.


