అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధి సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–3 ఏఎన్‌ఎంల పదోన్నతుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా దళిత ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జేఏసీ ప్రతినిధులు డి.గణేష్, మిస్కా కృష్ణయ్యలతో కలిసి డీఎంహెచ్‌వో కార్యాలయ ఏవో బాబూరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. పదోన్నతుల కల్పనలో దళితులు, ఆదివాసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో అన్యాయం జరిగిందన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని, లేకుంటే విచారణకు ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌ను సైతం తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడినట్లుగా తమకు సమాచారం ఉందని, ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. వీరితో పాటు మహిళా ప్రతినిధులు జెన్ని ఆరుద్ర, ఐలా కుమారి, సవర కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


