క్రీడలతో ఉజ్వల భవిష్యత్
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూన రవికుమార్, సూర శ్రీనివాసరావులు పేర్కొన్నారు. నగరంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో జాతీయ సాఫ్ట్ బాల్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడాకారులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు. క్రీడాకారులంతా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నెహ్రూ యువకేంద్రం కో–ఆర్డినేటర్ వెంకట ఉజ్వల్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలో సాఫ్ట్‌బాల్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. క్రీడాకారుల కోసం త్వరలో సాఫ్ట్ బాల్ క్రీడా పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, అసోసియేషన్ నాయకులు మెట్ట తిరుపతిరావు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల పంపిణీ గందరగోళం
సరుబుజ్జిలి: రబీ మొక్కజొన్న పంటల ఎరువుల పంపిణీకి సంబంధించి తెలికిపెంట సచివాలయం ఎరువుల గోదాం వద్ద మంగళవారం గందరగోళం నెలకొంది. సుమారు 444 ఎరువు బస్తాల పంపిణీకి వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఆ సమయంలో అధికార పక్షానికి చెందిన కొంతమంది వ్యక్తులు పంపిణీకి సంబంధించిన టోకెన్ల జారీ వద్ద ఉండడంపై వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బెవర మల్లేశ్వరరావు, చెంచల ముఖలింగం అభ్యంతరం తెలిపారు. అధికారులు ఎరువులు పంపిణీ చేయాల్సిన ప్రదేశంలో కూటమికి చెందిన నేతలు పర్యవేక్షణ చేస్తుంటే మీరేం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. అర్హత ఉన్న ప్రతీ రైతుకూ ఎరువులు అందించాల్సిన బాధ్యత అధికారులదేన్నారు. దీంతో ఇరుపక్షాలు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పోలీసులు వచ్చి ఇరుపక్షాలను శాంతింపజేశారు. ఇదే విషయమై అగ్రికల్చర్ అసిస్టెంట్ కె.అశోక్ వద్ద ప్రస్తావించగా సాగు విస్తీర్ణం మేరకు రైతులకు ఎరువులు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ రైతుకు విస్తీర్ణం మేరకు ఎరువులు అందిస్తామని, త్వరలో రెండో విడత ఎరువుల పంపిణీ ఉంటుందని వెల్లడించారు.
ఆటోను ఢీకొన్న కారు
టెక్కలి రూరల్: మండలంలోని పరశురాంపురం కూడలి సమీప జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కూరగాయల ఆటోను వెనుక నుంచి అదే మార్గంలో వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడగా, కారు ముందరి భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనపై టెక్కలి పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు.
మొదలైన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లోని ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సులకు చెందిన మూడో సెమిస్టర్ పరీక్షలు క్యాంపస్ కేంద్రంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. స్కిల్ డవలప్‌మెంట్ సబ్జెక్టుకు ఆర్ట్స్ కోర్సులకు సంబంధించి 319 మందికి గాను 17 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా సైన్స్ కోర్సులకు సంబంధించి 395 మందికి గాను 8 మంది పరీక్ష రాయలేదు. సైన్స్ కోర్సులకు ఆర్‌అండ్ డీన్ డాక్టర్ ఎన్.లోకేశ్వరి, ఆర్ట్స్ కోర్సులకు అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుబ్రమ్మణ్యంలు పరీక్షల చీఫ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్‌లో జరిగిన పరీక్షలను వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.స్వప్నవాహిని పరిశీలించారు. అదేవిధంగా డీపీఈడీ, బీపీఈడీ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈనెల 12వ తేదీ వరకు కొనసాగుతాయి. తొలిరోజు ఈ పరీక్షలకు 369 మంది హాజరయ్యారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
క్రీడలతో ఉజ్వల భవిష్యత్


