రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కంచిలి: మండలంలోని జలంత్రకోట నుంచి కంచిలి వచ్చే మార్గంలో జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోకర్ణపురం గ్రామానికి చెందిన యువకుడు సీర సాయికుమార్(28) దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ మార్గంలో రోడ్డు పక్కన డివైడర్లపైన మొక్కలు వేసిన చోట పిచ్చిమొక్కలు తొలగించే ప్రక్రియలో భాగంగా నిర్వహణ పనులు చేపట్టేవారు అక్కడ స్టాపర్స్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. మృతుడు సాయికుమర్ స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వీటి పక్కనుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్టాపర్స్ పెట్టడంతో కొంత అయోమయానికి గురై ప్రమాదానికి గురవ్వడంతో, అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న లారీ ఢీకొని తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో, కంచిలి పోలీసులు వెంబడించి ఒడి శా పరిధి గిరిసోల వద్ద పట్టుకున్నట్లు సమాచారం.
దుబాయి నుంచి వచ్చి..
మృతుడు సాయికుమార్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. మూడు నెలల క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చి, తండ్రి వ్యవసాయ పనులకు తోడుగా ఉంటున్నాడు. మధ్యాహ్నం సోంపేటలో సెలూన్ షాపుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. కుమారుడు చనిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేని మృతుని తల్లిదండ్రులు చంద్రమ్మ, శ్యామ్‌లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా సాయికుమార్ తమ్ముడు రామకృష్ణ ఏడాదిన్నర క్రితం సోంపేట రైల్వేస్టేషన్ ఆవరణలో రైలు ప్రమాదానికి గురై మృతి చెందాడు. తమ్ముడు మృతి చెందిన ఏడాదిన్నరకే అన్న కూడా మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం


