వైభవంగా చొయితీ ఉత్సవాల నిర్వహణ
● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి
రాయగడ: స్థానిక గొవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న జిల్లాస్థాయి చొయితీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. ఉత్సవాల నిర్వహణపై స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షించారు. చొయితీ ఉప కమిటీల ప్రతినిధులతో మాట్లాడారు. ఉత్సవాలకు సంబంధించి ఏర్పాటు కానున్న సన్సాహాలపై అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది చొయితీ ఉత్సవాల జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అదేతరహా ఈ ఏడాది ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఉత్సవాలకు సంబంధించి ఆహ్వానించాల్సిన ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరుల వివరాలు తెలుసుకున్నారు. ఆహ్వానించే విషయంలో సబ్ కమిటీ తగిన రీతిన స్పందించి వచ్చే అతిథులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐదు రోజులు జరగనున్న ఉత్సవాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆరా తీశారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుస్మిత బౌరి పాల్గొన్నారు.


