బైక్ ఢీకొని వ్యక్తి మృతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన బొయిపరిగుడ సమితి దొరాగుడ పంచాయతీ లెపాగుడ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రమాదంలో మరణించిన వ్యక్తి మఝిగుడ ధనుర్జయ మఝి అని తెలిసింది. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లభించిన వివరాల ప్రకారం లెపాగుడ గ్రామం కళాశాల విద్యార్థి బికాశ ఖొర తన స్నేహితునితో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ముండగుడ వంతెన వైపు బయలు దేరారు. అక్కడ నుంచి పొద్దుపోయిన తర్వాత వంతెన నుంచి తిరిగి వస్తుండగా లెపాగుడ గ్రామంలో ఒక బైక్ బికాశ బైక్‌ను ఢీకొనగా బికాశ్ తీవ్రంగా గాయ పడ్డాడు. ఈ ప్రమాదంలో బికాశ్ బైక్ వెనుక కూర్చుని వస్తున్న మఝిగుడ వాసి ధనుంజయ మఝి, బికాశ్ బైక్‌ను ఢీకొన్న డుమురిగుడ వాసి ధనుర్జయ నాయిక్ కూడా గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన వారిని బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడ నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ధనుర్జయ మఝి మరణించాడు. బొయిపరిగుడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మరణించిన ధనుంజయ మఝి మృత దేహానికి పోస్టు మార్టం జరిపి అనంతరం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం.


