ఎం.వి–26 గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
● రెండు గ్రామాల మధ్య ఘర్షణలు
● 70కు పైగా మంటల్లో కాలిపోయిన ఇళ్లు
● భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపు
మల్కనగిరి: జిల్లాలోని కొరుకొండ సమితి ఎం.వి–26 గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎంవి–26 గ్రామంలో గల సుమారు 70కు పైబడిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసు బలగాలు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో 163 సెక్షన్‌ను అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొరుకొండ సమితి పరిధిలో గల రకూల్‌గుడ గ్రామానికి చెందిన లక్కీపొడియాని (85) అనే ఆదివాసీ వృద్ధ మహిళను కొంతమంది గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి ఆమె తలను వేరుచేశారు. మృతదేహాన్ని సమీపంలో గల పోటేరు నదిలో పడేశారు. ఈ నెల 5వ తేదీన పొలం పనుల్లో నిమగ్నమైన లక్కీపొడియాని హత్య ఘటనపై బాధిత కుటుంబీకులు కొరుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోటేరు నదిలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తలలేని మహిళ మృతదేహాన్ని శనివారం గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ మృతదేహం తమ గ్రామానికి చెందిన లక్కీపొడియానిదే అయి ఉంటుందని, మిగతా శరీర భాగం లభించేంత వరకు పోస్టుమార్టం చేయకూడదని రకూల్‌గుడ గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. ఎంవి–26 గ్రామంలోని కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని భావించి మరణాయుధాలతో దాడి చేసి, గ్రామంలో ఉన్న అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేశారు. కనిపించిన వాహనాలను దగ్ధం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. అనంతరం 163 సెక్షన్‌ను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ ప్రదీప్ మాఝి రంగంలోకి దిగారు. ఆందోళనకారులతో మాట్లాడారు. ఘర్షణలకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరి మాటలను పట్టించుకోని ఆందోళనకారులు తమకు న్యాయం జరిగేవరకు ఆందోళనను కొనసాగిస్తామన్నారు.
ఎం.వి–26 గ్రామస్తుల నిరసన..
తమ గ్రామంపై రకూల్‌గుడ గ్రామస్తులు దాడి చేసి తీరని నష్టం చేకూర్చారని నిరసిస్తూ ఎంవి–26 గ్రామస్తులు సోమవారం నిరసన చేపట్టారు. సుమారు రెండు వేల మందికి పైగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దాడిలో నష్టపోయిన బాధిత కుటుంబీకులకు తగిన న్యాయం చేయాలని కోరారు.


