రాయ్‌పూర్–విశాఖపట్నం కారిడార్
● మారుమూల జిల్లాల అనుసంధానం
భువనేశ్వర్: ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రాయ్‌పూర్, విశాఖపట్నం ఆర్థిక కారిడార్ (ఆర్‌వీఈసీ) నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుంది. ఈ కారిడార్ రాష్ట్రంలో మారుమూల జిల్లాలను అనుసంధానపరచి వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. రోడ్డు రవాణా–రహదారుల శాఖ రూ. 16,482 కోట్ల వ్యయంతో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి దార్శనికతకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలను ప్రధాన స్రవంతి ఆర్థిక వ్యవస్థలో జోడించి పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరంతర వృద్ధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. చత్తీస్‌గఢ్ అడవులు, ఒడిశాలోని ఖనిజ సంపద కలిగిన ప్రకృతి దృశ్యాలు, ఆంధ్రప్రదేశ్ కొండల నడుమ విస్తరించి ఉన్న రాయ్‌పూర్, విశాఖపట్నం ఆర్థిక కారిడార్ 26వ నంబరు జాతీయ రహదారి గుండా రాయ్‌పూర్, విశాఖపట్నం మధ్య నిర్మితం అవుతుంది. ఈ పనులు పూర్తి అయితే ప్రస్తుత దూరాన్ని 597 కిలో మీటర్లు నుంచి 465 కిలో మీటర్లకు తగ్గిస్తుంది. ప్రయాణ సమయం సుదీర్ఘ 12 గంటల నుంచి కేవలం 5 గంటలకు తగ్గుతుంది. ఈ తగ్గుదల గణనీయమైన ఇంధన ఆదాతో ప్రజలకు, సరుకు రవాణా ఆపరేటర్లకు రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. ఈ కారిడార్ బొరిగుమ్మ, నవరంగ్‌పూర్, కొరాపుట్ వంటి గిరిజన, అభివృద్ధి చెందని జిల్లాల గుండా వెళుతుంది. మార్కెట్లు, ఓడ రేవులు, పారిశ్రామిక కేంద్రాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తెచ్చి స్థానిక పరిశ్రమల ప్రోత్సాహానికి దోహదపడుతుంది. విశాఖపట్నం ఓడ రేవు ద్వారా ఎగుమతులను సులభతరం చేస్తుంది. లాజిస్టిక్స్, వాణిజ్యం మరియు రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక లాభాలతో గిరిజన వర్గాల సాధికారితకు బలమైన సోపానంగా నిలుస్తుంది. ప్రస్తుత 2 వరుసల 26వ నంబరు జాతీయ రహదారిపై రవాణా ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ రహదారి ప్రయాణికులకు, సరుకు రవాణా ఆపరేటర్లకు బహుముఖ ప్రయోజనకారిగా నిలుస్తుంది.


