సంక్షోభానికి కారణం కేంద్రమంత్రే
● వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్
ఆమదాలవలస: గడచిన కొన్ని రోజులుగా దేశంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని, ఈ స్థితికి కారణం కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడేనని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రామ్మోహన్‌నాయుడు అతి పిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి చేపట్టారని, ఉత్తరాంధ్రకు, జిల్లాకు మంచి పేరు తీసుకువస్తారని ఆశించినా ఇలా అప్రతిష్ట మూటగట్టారని అన్నారు. జాతీయ స్థాయి మీడియాలో సైతం రీల్స్ మీమ్స్ పబ్లిసిటీ చేసుకునే వ్యక్తిగా నిలిచారని తెలిపారు. ఇండిగో విమానయాన సంక్షోభంపై ప్రధానమంత్రి అధ్యక్షతన నిర్వహించిన హై లెవెల్ సమావేశానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిని పిలవకపోవడం సిగ్గుచేటని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అంశంలో కూడా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని లీగల్ సమస్యలను పరిష్కరించి 2300 ఎకరాల భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ తిప్పి నిర్మాణాన్ని జీఎంఆర్‌కు అప్పగించారని గుర్తు చేశారు. కానీ అక్కడ కూడా రామ్మోహన్ నాయుడు అంతా తమ ఘనతే అన్నట్టు రీల్స్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కింజరాపు కుటుంబ సభ్యులు ఎన్నో పదవులు అనుభవించినా జిల్లాకు చేసిందేమిటని ప్రశ్నించారు. సమావేశంలో బూర్జ మండలపార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, పార్టీ నాయకులు బొడ్డేపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


