ఖో–ఖో అసోసియేషన్ కోశాధికారిగా శ్రీనివాస్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖో–ఖో అసోసియేషన్ నూతన కార్యవర్గంలో శ్రీకాకుళం జిల్లాకు పెద్దపీట లభించింది. సోమవారం ఏలూరు వేదికగా జరిగిన ఏపీ రాష్ట్ర ఖో–ఖో అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర కోశాధికారిగా జిల్లాకు చెందిన సాధు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన శ్రీకూర్మం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ (ఎస్‌ఏ పీఈ)గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్ధాలుగా జిల్లా కబడ్డీ, ఖో–ఖో క్రీడాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కబడ్డీ, ఖోఖో అసోసియేషన్‌లో కీలకభూమిక పోషిస్తున్నారు. ఈయన ఎన్నికపై జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి నాగభూషణరావు, కార్యదర్శి ఫల్గుణరావు, కబడ్డీ సంఘ జిల్లా చైర్మన్ ఎమ్మెల్యే గొండు శంకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


