టీ–20 మ్యాచ్‌కు మూడంచెల భద్రత
భువనేశ్వర్: ఈ నెల 9న కటక్ బారాబటి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ–20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) యోగేష్ బహదూర్ ఖురానియా ప్రత్యక్షంగా బారాబటి స్టేడియం సందర్శించి భద్ర తా ఏర్పాట్లు సమీక్షించారు. స్టేడియం లోపల, పరిసరాల్లో క్రికెటర్ల భద్రత, రద్దీ నియంత్రణ తదితర శాంతిభద్రతల నిర్వహణ కోసం సమగ్ర భద్రత సన్నద్ధతను డీజీపీ పరిశీలించారు. మ్యాచ్ ఆద్యంతాలు మూడు అంచెల భద్రతా వ్యవస్థను మోహరించినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రవేశం, నిష్క్రమణ పాయింట్ల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు, సీసీటీవీ నిఘా, విధ్వంస నిరోధక చర్యలు, పోలీసుల మోహరింపు, రెండు జట్ల క్రీడాకారులు, అధికారుల రాకపోకల్లో ప్రత్యేక నియమావళిపై వివరణాత్మక చర్చించారు. క్షేత్ర స్థాయి లో ఏర్పాట్లు సమీక్షించిన డీజీపీ మాట్లాడుతూ ప్రేక్షకుల పూర్తి సహకారంతో ఈ మ్యాచ్ నిర్వహణ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రద్దీ నివారణ దృష్ట్యా చివరి నిమిషం వరకు నిరీక్షించకుండా ప్రేక్షకులు 3 నుంచి 4 గంటలు ముందుగానే రావాలని తెలిపారు. మ్యాచ్ శాంతియుతంగా, సురక్షితంగా, క్రమశిక్షణతో జరిగేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని హామీ ఇచ్చారు. సమీక్షలో పోలీస్ కమిషనర్ ఎస్. దేవ్ దత్తా సింగ్, అదనపు కమిషనర్ నరసింహ భోల్, కటక్ డీసీపీ ఖిలారి రిషికేశ్ ద్యాండియో, సీనియర్ పోలీసు అధికారులు, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


