విద్య నైతిక నాయకత్వానికి పునాది
భువనేశ్వర్: పట్టభద్రులుగా ఉత్తీర్ణత వాస్తవ జీవితంలో తీసుకునే నిర్ణయాలు, సమర్థమైన బాధ్యతల నిర్వహణలో తేటతెల్లం అవుతుందని, అధునాతన సాంకేతికతలతో శర వేగంగా మారుతున్న భావి ప్రపంచంలోకి అడుగిడుతున్న గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు ఏ రంగంలోనైనా నిజాయితీ, క్రమశిక్షణతో వృత్తి నైపుణ్యం చాటుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రబోధించారు. స్థానిక బిర్లా గ్లోబల్ యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రతిభావంతులైన విద్యార్థులకు డిగ్రీలు, పతకాలను అందజేశారు. పరిశ్రమల పురోగతికి దోహదపడే సాంకేతికత మానవ లక్షణాలను భర్తీ చేయలేదని గవర్నర్ అన్నారు. రాగల సమీప భవిష్యతులో సానుభూతి, సృజనాత్మకత, నైతిక విలువలు వ్యక్తులను విభిన్నంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాధనాలు, ఆటోమేషన్, నిరంతర సవాళ్లతో కూడిన ప్రపంచంలోనికి విద్యార్థులు ప్రవేశిస్తున్న తరుణంలో విద్యను ఉపాధికి సోపానంగా కాకుండా జీవితాంతం నేర్చుకోవడానికి, నైతిక నాయకత్వానికి పునాదిగా వినియోగించుకోవాలని ప్రేరేపించారు. వృత్తి రంగం ఎంపికలో పరిసరాలకు అనుగుణంగా సామాజిక దృక్పథం ప్రామాణికంగా పరిగణించి వినయం, నిజాయితీ, క్రమశిక్షణ మార్గదర్శకాలుగా తదుపరి దశ జీవనానికి శ్రీకారం చుట్టాలని ప్రోత్సహించారు.
వైఫల్యం దృఢ సంకల్పంతో తిరిగి ఎదగడానికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యంతో నిజమైన నాయకత్వం ఆవిష్కరిస్తుంది. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఎదుగుదలకు అవకాశాలుగా మలచుకుని ముందుకు సాగాలని అభినందించారు. భారతదేశంలోని కెపిఎంజి విద్య, నైపుణ్య అభివృద్ధి, ప్రభుత్వం, ప్రజా సేవల జాతీయ నాయకుడు నారాయణ రామస్వామి, బిర్లా గ్లోబల్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కులభూషణ్ బలూని, బిర్లా గ్లోబల్ విశ్వవిద్యాలయం గవర్నర్ల బోర్డు సభ్యుడు డాక్టర్ పి. కె.మిశ్రా తదితరులు ప్రసంగించారు.
విద్య నైతిక నాయకత్వానికి పునాది
విద్య నైతిక నాయకత్వానికి పునాది


