పెట్టుబడులకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ప్రాధాన్యం

Dec 7 2025 7:24 AM | Updated on Dec 7 2025 7:24 AM

పెట్ట

పెట్టుబడులకు ప్రాధాన్యం

విద్యుత్‌ రంగంలో

సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ

పూరీలో గ్లోబల్‌ ఎనర్జీ లీడర్స్‌ సమ్మిట్‌

భువనేశ్వర్‌: పూరీలో జరిగిన గ్లోబల్‌ ఎనర్జీ లీడర్స్‌ సమ్మిట్‌–2025 (జీఈఎల్‌–2025)ను ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ శనివారం ప్రారంభించారు. క్లీన్‌ ఎనర్జీ రంగంలో స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయడానికి ఇది తొలి అంతర్జాతీయ చొరవ కావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం మోహన్‌చరణ్‌ మాఝీ మాట్లాడుతూ.. సదస్సు కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమలు, పరిశోధకులు, సంస్థలు మరియు ప్రపంచ విద్యుత్‌ నిపుణులను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి విద్యుత్‌ రంగంలో స్వావలంబన మరియు స్థిరత్వ సాధనకు వినూత్న ప్రయత్నంగా పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్‌ సరఫరా గొలుసును కీలక అంశంగా పరిగణిస్తుందన్నారు. భవిష్యత్‌ తరాల కోసం ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అవసరాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. శిలాజ విద్యుత్‌ (ఫాసిల్‌ ఎనర్జీ) ఉత్పత్తి మరియు వినియోగ వ్యయాన్ని తగ్గించి 2036 నాటికి రాష్ట్రం గ్రీన్‌ ఎనర్జీ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందన్నారు. 2014కి ముందు దేశవ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్‌ సరఫరా ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేశారు. విద్యుత్‌ ఉత్పాదన కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ అంతరాయం నిత్యకృత్యంగా మారిందన్నారు. గత దశాబ్ధంలో ఈ పరిస్థితి మెరుగుపడి గత 11 సంవత్సరాల్లో భారతదేశ విద్యుత్‌ రంగం వేగవంతమైన వృద్ధిని సాధించిందన్నారు. సమగ్ర అభివృద్ధికి విద్యుత్‌ ఉత్పత్తితో విద్యుత్‌ పంపిణీకి మౌలిక సదుపాయాలు కూడా అవసరం.

నిండుకుంటున్న నిక్షేపాలు

ప్రస్తుతం భారతదేశంలో బొగ్గు వనరుల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి 51 శాతానికి పరిమితం అయింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో ఒడిశా విద్యుత్‌ ఉత్పాదన రంగంలో స్థిరంగా ముందుకు సాగేందుకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది. 2070 నాటికి జీరో కార్బైన్‌ ఎమిషన్‌ దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మేరకు ప్రభుత్వం నిబద్ధతతో కొనసాగుతందని సీఎం ప్రకటించారు. పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర పునరుత్పాదక విద్యుత్‌ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పాదనలో ఒడిశా పురోగతిని అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి 1 లక్ష 50 వేల సౌర గృహాలకు ఆమోదం ప్రకటించారు. దీనివలన రాష్ట్రంలో 7 నుంచి 8 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. 2014లో 2.8 గిగా వాట్లకు పరిమితమైన జాతీయ సౌర విద్యుత్‌ సామర్థ్యం నేడు 130 గిగా వాట్లకు ఎదిగిందన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్‌ మాజీ ప్రధానమంత్రి సర్‌ టోనీ బ్లెయిర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఒడిశాను అభినందించారు. ఒక ప్రభుత్వం చర్య తీసుకున్నప్పుడు ఇంధన పరివర్తన జరగదని, కానీ అనేక ప్రభుత్వాలు కాలక్రమేణా ఒకే దిశలో పనిచేసినప్పుడు, ఇంధన పరివర్తన ప్రయత్నం విజయవంతమవుతుందని ఆయన అన్నారు. ఇదే గ్లోబల్‌ ఎనర్జీ లీడర్స్‌ సమ్మిట్‌ ఉద్దేశ్యంగా ఆయన పేర్కొన్నారు.

భారీ పెట్టుబడులే లక్ష్యం

ఉప ముఖ్యమంత్రి కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌ మాట్లాడుతూ 2030 నాటికి పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం ద్వారా పరిశ్రమ మరియు వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2036 నాటికి ఒడిశా 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి, క్లీన్‌ ఎనర్జీ ఉత్పాదన మరియు గ్రీన్‌ హైడ్రోజన్‌కు ప్రముఖ కేంద్రంగా మారడానికి ఒడిశా ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ విద్యుత్‌ శాఖ మంత్రి ఆశిష్‌ సూద్‌, రాజస్థాన్‌ విద్యుత్‌ విభాగం మంత్రి హీరా లాల్‌ నగర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి మనోజ్‌ ఆహుజా, విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ విశాల్‌ కుమార్‌ దేబ్‌, టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ చేంజ్‌ సీనియర్‌ ఎనర్జీ అడ్వైజర్‌ పియరీ నోఝెల్‌, ఐఐటీ కాన్పూర్‌ సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ రెగ్యులేషన్‌ అండ్‌ ఎనర్జీ అనలిటిక్స్‌ ల్యాబ్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ అనుప్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడులకు ప్రాధాన్యం1
1/1

పెట్టుబడులకు ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement