యజమాని లాగిన్‌తో.. కస్టమర్లకు మోసం
● రూ.12.80 లక్షలు కాజేసిన ఉద్యోగి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని సానావీధిలో ఉన్న హారిక కన్‌స్ట్రక్షన్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తి యజమానికి తెలియకుండా అతని లాగిన్‌లోకి ఎంటరై డూప్లికేట్ ఈ–చలానా జనరేట్ చేయడమే కాకుండా.. డూప్లికేట్ ప్లాన్లు ఇచ్చి 13 మంది వద్ద నుంచి రూ.12.80 లక్షలు కాజేశాడు. దీంతో యజమాని హారికా ప్రసాద్ శనివారం రాత్రి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జలుమూరు మండలంలోని చల్లపేటకు చెందిన షావుకారి భార్గవ్ కొంతకాలంగా హారికా ప్రసాద్ వద్ద పనిచేస్తూ, అతని వద్దకు వచ్చే కస్టమర్లకు కన్‌స్ట్రక్షన్ ప్లాన్లు తయారు చేస్తుండేవాడు. ప్లాన్లు ఇచ్చాక రుణాల కోసం కస్టమర్లు అప్లయ్ చేసుకునేవాళ్లు. అయితే గతేడాది ఆగస్టు నుంచి యజమానికి తెలియకుండా అతని సిస్టమ్‌లోని లాగిన్‌ను భార్గవ్ ఓపెన్ చేసి శ్రీకాకుళం, టెక్కలి, ఎచ్చెర్లకు చెందిన 11 మంది కస్టమర్లకు డూప్లికేట్ ఈ–చలానాలు జనరేట్ చేసి, డూప్లికేట్ ప్లాన్లు అందించాడు. విషయం తెలియని కస్టమర్లు ఖజానా కార్యాలయానికి వెళ్లి తమ లోన్ ప్రాసెస్ గురించి ఎప్పడు అడిగినా వారు అప్లయ్ కాలేదని చెప్పడం, డబ్బులు కూడా పే కాలేదని చెప్పడంతో నాలుగు నెలల క్రితం హారికాప్రసాద్‌ను నిలదీశారు. దీంతో అప్పట్లోనే హారికాప్రసాద్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే భార్గవ్ బంధువులు ప్రసాద్‌కు నచ్చజెప్పి మీ డబ్బులకు జవాబుదారీగా అక్కడే పనిచేస్తాడని, తొందర్లోనే క్లియర్ చేస్తాడని చెప్పడంతో ఆగిపోయారు. కాగా పదిరోజుల క్రితం మరో ఇద్దరినీ ఇదే తరహాలో మోసం చేయడం, డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో శనివారం పోలీసులకు ప్రసాద్ ఫిర్యాదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసుల వెల్లడించారు.
నూతన వసతులతో వర్సిటీ క్యాంపస్
ఎచ్చెర్ల: బీఆర్‌ఏయూలో నూతన వసతులతో సిద్ధమైన క్యాంటిన్ శనివారం పునః ప్రారంభమైంది. డైనింగ్ హాల్, కిచెన్ మరింతగా ఆధునీకరించి పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా తయారుచేయగా వర్సిటీ వీసీ ఆచార్య కె.ఆర్.రజనీ ప్రారంభించారు. వర్శిటీ అధికారులు, అధ్యాపకులతో కలిసి టిఫిన్ చేశారు. శుభ్రత, నాణ్యతలో రాజీపడకుండా తాజా ఆహార పదార్థాలను వర్సిటీ వర్గాలకు, సందర్శకులకు అందించాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ పి.సుజాత, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఎం.అనురాధ, డా.సీహెచ్ రాజశేఖరరావు, డా.కె.స్వప్నవాహిని, ఇంజినీర్లు ఎల్.అనంతరావు, ఎస్.తారకేష్, క్యాంటిన్ నిర్వాహకులు డాక్టర్ బుషి, సత్యనారాయణ, హర్ష, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షల శాతం పెరిగేలా చూడాలి
శ్రీకాకుళం క్రైమ్: కేసుల విచారణ, ఛార్జిషీటు దాఖలులో లోపాలు లేకుండా చూడడం, నిందితుల హాజరు, సమన్లు–వారెంట్లు అమలు చేయడం, కోర్టులో శిక్షల శాతం పెరిగేలా చూడాల్సిన కీలక పాత్ర కోర్టు కానిస్టేబుళ్లదేనని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. కేసుల విచారణ సమయంలో సాక్షులను హాజరుపర్చడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయంగా ఉండడం ముఖ్యమన్నారు. రిఫరల్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని, కోర్టు ప్రక్రియలు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డొంకూరులో పోలీస్ పికెట్
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని డొంకూరు మత్స్యకార గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో మొత్తం 8 మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారని, మిగతా బాధితులు ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని సీఐ ఎం.చిన్నంనాయుడు శనివారం తెలిపారు. దీంతో గ్రామంలో శాంతిభద్రతల కోసం పలాస ఆర్డీవో జి.వెంకటేష్, పలాస డీఎస్పీ డి.లక్ష్మణరావులు సాయంత్రం డొంకూరు గ్రామానికి వెళ్లి ఇరువర్గాలతో మాట్లాడారు. మతపరమైన విభేదాలు, ఘర్షణలు మళ్లీ చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలసి ఉండాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఘర్షణకు దిగిన 13 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం గ్రామంలోని ప్రజలు భయందోళనతో ఉండడంతో ఇచ్ఛాపురం పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, కవిటి ఎస్‌ఐ రవివర్మలు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు.
యజమాని లాగిన్‌తో.. కస్టమర్లకు మోసం


