భక్తులకు సులభ దర్శనం లక్ష్యం: సీఏఓ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ స్వామి దర్శనం సులభతరం చేయడం లక్ష్యంగా నిర్ధారిత కార్యాచరణ కొనసాగుతుందని శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి (సీఏఓ) డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి తెలిపారు. నెలవారీ పనులు సమీక్షించిన సందర్భంగా ఈ విషయం తెలిపారు. సేవా ఉప సంఘం మరియు ఆర్థిక ఉప సంఘం సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గత నెలలో అధికారులు, ఉద్యోగులకు కేటాయించిన నిర్దిష్ట బాధ్యతల పురోగతిని సమీక్షించారు. భావి కార్యాచరణ ముసాయిదాతో పాటు నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులు, దర్శన ఏర్పాట్లు, వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న శ్రీ మందిరం కేసులు, సాధారణ రోజులలో శ్రీ గుండిచా ఆలయ దర్శనానికి భక్తుల ప్రవేశం ప్రధాన అంశాలుగా చర్చించారు. శ్రీ మందిరంలో కోయిలి వైకుంఠం వద్ద ఉన్న రోహిణి కుండం, దీపాల స్టాండ్, పుష్ప మండపం, హుండి లెక్కింపు గది పనులు, శ్రీ గుండిచా ఆలయం యొక్క అసంపూర్ణ పనుల పూర్తిపై ప్రాధాన్యతకు ఆదేశించారు. ఈ పనుల్లో భాగంగా శ్రీ గుండిచా ఆలయం యొక్క ఉత్తరం వైపు కొత్త గేటు నిర్మించి, ఖండోలైట్ పలకలను ఏర్పాటు చేయా లని ఇంజినీర్లకు తెలిపారు. శ్రీ మందిరంలో దర్శన వ్యవస్థను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి అనుబంధ వర్గాలతో చర్చలు ముగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కోర్టులలో శ్రీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన పెండింగ్ కేసులను కంప్యూటరీకరించి శ్రీ మందిరం తరఫున కేసులను వాదించడానికి అనుభవజ్ఞులైన న్యాయవాదుల జాబితాను సిద్ధం చేయాలని ప్రధాన నిర్వాహకుడు సూచించారు. ఓబీసీసీ అప్పగింత తర్వాత శ్రీ జగన్నాథ్ వల్లభ పార్కింగ్ స్థలం కోసం శ్రీ మందిర్ ద్వారా టెండర్లు ఆహ్వానిస్తారు. శ్రీ గుండిచా ఆలయానికి ప్రయాణీకుల రవాణా వ్యవహారం శ్రీమందిర్ పరిపాలన నేరుగా ఏర్పాట్లను నిర్వహిస్తుందని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రధాన నిర్వాహకుడు, దేవాదాయ కమిషనర్, సేవా విభాగం అదనపు కార్యదర్శి, కలెక్టర్, శ్రీ మందిర్ నిర్వాహకుడు, శ్రీ మందిర్ అన్ని విభాగాల అధికారులు, శ్రీమందిర్ ఉద్యోగులు ఈ సందర్భంగా హాజరయ్యారు.


