నిర్లక్ష్యం వల్లనే ప్రాణనష్టం | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వల్లనే ప్రాణనష్టం

Nov 9 2025 6:53 AM | Updated on Nov 9 2025 6:53 AM

నిర్లక్ష్యం వల్లనే ప్రాణనష్టం

నిర్లక్ష్యం వల్లనే ప్రాణనష్టం

● పూరీ శారదా బాలి తొక్కిసలాట దర్యాప్తు నివేదిక వెల్లడి

బాధ్యులైన ఏడుగురు పోలీసు అధికారుల జాబితా

అజయ్‌ కుమార్‌ పాఢి, కమాండెంట్‌, ఓఎస్‌ఏపీ 3వ బెటాలియన్‌, కొరాపుట్‌

విష్ణు ప్రసాద్‌ పతి, డీసీపీ (ప్రధాన కార్యాలయం), భువనేశ్వర్‌–కటక్‌ కమిషనరేట్‌ పోలీస్‌

తాపస్‌ రంజన్‌ దాస్‌, కమాండెంట్‌, ఎస్‌ఎస్‌ఎంఎస్‌వీ, పూరీ

కె. కె. నాయక్‌, డిప్యూటీ కమాండెంట్‌, ఎస్‌ఎస్‌ఎంఎస్‌వీ, పూరీ

ప్రశాంత్‌ కుమార్‌ సాహు, పూరీ సిటీ డీఎస్పీ

సుశాంత కుమార్‌ సాహు, కుంభారపొడా పోలీస్‌ ఠాణా ఇంచార్జి అధికారి

శారదా ప్రసాద్‌ దాస్‌, కమాండెంట్‌, ఓఎస్‌ఏపీ 3వ బెటాలియన్‌, చత్రపూర్‌.

● పూరీ శారదా బాలి తొక్కిసలాట దర్యాప్తు నివేదిక వెల్లడి

భువనేశ్వర్‌:

ఏడాది పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్భంగా శ్రీ గుండిచా ఆవరణ శారదా బాలి ప్రాంతంలో తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. ఈ విషాద సంఘటన భక్తజన హృదయాల్ని కలచి వేసింది. ప్రభుత్వం, యాత్ర నిర్వహణ యంత్రాంగం కంటి మీద కునుకు చెదరగొట్టింది. భక్తులు, యాత్రికుల భద్రత కోసం ప్రత్యేకంగా నియమితులైన ఉన్నతాధికారులు, సాంకేతిక సేవల సంస్థ నిర్లక్ష్యంతో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని దర్యాప్తులో తేలింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

సీనియర్‌ పోలీసు అధికారులు బాధ్యులు

రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సీనియర్‌ పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రద్దీ నియంత్రణ కోసం కృత్రిమ మేధతో సముచిత సమాచారం జారీ చేయాల్సిన సంస్థ కూడ నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు దర్యాప్తు నివేదిక ధ్రువీకరించింది. ఆ సంస్థ అవాంఛనీయ సంస్థగా ప్రకటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్‌ 29న పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ఉత్సవంలో గుండిచా ఆలయ ప్రాంగణం శారదబాలిలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కమిషనర్‌, అదనపు ప్రముఖ కార్యదర్శి (ప్రణాళిక – సమన్వయం) ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో పోలీసుల పర్యవేక్షణలో తీవ్రమైన లోపాలు, ఆలయ అధికార వర్గంతో సమన్వయ లోపం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ) వైఫల్యం వంటి తీవ్రమైన లోపాలు ఉన్నాయని తేలింది. దర్యాప్తు నివేదికను ప్రభుత్వం ఆమోదించిందని హోం (ప్రత్యేక విభాగం) అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సీనియర్‌ పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. విచారణలో, రద్దీ నియంత్రణ ఇన్‌చార్జిగా నియమితులైన ఇద్దరు సీనియర్‌ అధికారులు అజయ్‌ కుమార్‌ పాఢి, విష్ణు ప్రసాద్‌ పతి ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో లేరు. రద్దీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని దర్యాప్తులో తేటతెల్లమైంది. వారివురు ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతున్నారు. 1962 ఒడిశా సివిల్‌ సర్వీసెస్‌ (సీసీఏ) 15వ నిబంధన ప్రకారం వారిపై చర్యలు చేపట్టాలని హోం శాఖ అదనపు కార్యదర్శి డీజీపీ, ఐజీ పోలీసుకు లేఖ రాశారు. భక్తులతో కిటకిటలాడుతున్న జన సందోహ ప్రాంతాల గుండా అలంకార చెక్క సామగ్రిని తీసుకెళ్లే ట్రక్కుల రాకపోకలను పోలీసులు అనుమతించారు. ట్రక్కులు ప్రవేశించడంతో గుండిచా ఆలయం వెలుపల శారాదా బాలి మైదానంలో భయాందోళనలతో చెల్లాచెదురు కావడంతో అకస్మాత్తుగా తొక్కిసలాట సంభవించింది. తప్పనిసరి సేవలను అందించడంలో విఫలమైనందుకు ఐసీసీసీ సంస్థ మెస్సర్స్‌ ఇన్వెంట్‌ గ్రిడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రభుత్వం అవాంఛనీయ జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. లైవ్‌ ఫీడ్‌లలో జన సమూహం కనిపించినప్పటికీ అధికారులను అప్రమత్తం చేయడంలో విఫలమైనందుకు కమాండెంట్‌ శారద ప్రసాద్‌ దాస్‌ వ్యతిరేకంగా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. పూరీలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ) అధీనంలో 275 కెమెరాలు ఏర్పాటు చేయగా సంఘటన జరిగిన సమయంలో నామ మాత్రంగా 123 మాత్రమే పనిచేసినట్లు దర్యాప్తు ధ్రువీకరించింది. రాష్ట్ర అభివృద్ధి కమిషనర్‌ అనూ గర్గ్‌ అధ్యక్షతన 4 మంది ఓఏఎస్‌ అధికారుల సహాయక సభ్యులతో కూడిన బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది జూలై 31న లోక్‌ సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీకి దర్యాప్తు నివేదికను సమర్పించారు. భువనేశ్వర్‌, పూరీ రెండు వేర్వేరు చోట్లలో దర్యాప్తు బృందం బహిరంగ విచారణ చేపట్టింది. 60 మందికి పైగా వ్యక్తులను, అధికారులను కలిసి, సంభాషించిన తర్వాత దర్యాప్తు నివేదికను రూపొందించినట్లు తెలిపారు. దర్యాప్తులో సహాయపడటానికి తొక్కిసలాట దృశ్యాలను పంపమని ప్రత్యక్ష సాక్షులకు దర్యాప్తు బృందం అభ్యర్థించింది. విచారణలో నలుగురు ఓఏఎస్‌ అధికారులు మానస్‌ రంజన్‌ సామల్‌, బినయ్‌ కుమార్‌ దాస్‌, రష్మి రంజన్‌ నాయక్‌, ప్రదీప్‌ కుమార్‌ సాహు సహాయకులుగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement