ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
నరసన్నపేట: లండన్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ టూరి జం మేనేజ్‌మెంట్ (డబ్ల్యూటీఎం) కార్యక్రమంలో నరసన్నపేట కూచిపూడి నృత్యాలయం నిర్వహకురాలు కీర్తిప్రియ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ తరుపున కీర్తిప్రియ పాల్గొని ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద నృత్యప్రదర్శన ఇచ్చారు. కాగా ఈ కార్య క్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఫర్నీచర్ షాప్‌లో చోరీ
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని గరుడభద్ర రహదారిలో ఉన్న మోడ్రన్ ఫర్నీచర్ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు అందించిన వివరాల మేరకు.. రాజాం గ్రామానికి చెందిన చెల్లూరి సోమేశ్వరరావు గత కొంతకాలంగా ఫర్నీచర్ షాపు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. అయితే అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్న చోరీ ఘటనలో 20 ఎలక్ట్రికల్ యంత్ర పనిముట్లు, ఆదే ప్రాంగణంలో ఉన్న మినీ ట్రాక్టర్‌ను దొంగలు అపహరించుకుపోయారు. షాప్ ప్రధాన తలుపునకు వేసి ఉన్న తాళం విరగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగానే బుధవారం ఉదయం షాపునకు వెళ్లేసరికి చోరీ జరిగినట్లు గుర్తించిన యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిమార్ తెలిపారు. చోరీకి గురైన సొత్తు రూ.6 లక్షలు ఉంటుందని బాధితులు వాపోతున్నారు.
ప్రభుత్వాలు కార్పొరేట్లకు అమ్ముడుపోతున్నాయి
● చింతా మోహన్ విమర్శ
శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. ఇక్కడ బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డేటా సెంటర్ కోసం గూగుల్‌కు వేల కోట్ల ప్రయోజనాలు కల్పించడాన్ని ప్రస్తావిస్తూ.. చిన్న సంస్థలకు రాయితీలు ఇవ్వాలి కానీ, కార్పొరేట్ సంస్థలకు అవసరం లేదన్నారు. దేశంలో వ్యవసాయం సంక్షోభంలో కొనసాగుతుందని, నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు అవసరం లేదన్నారు. అవినీతిని ప్రశ్నించే మీడియా సంస్థలను సైతం తొక్కేసే పరిస్థితి కొనసాగుతోందన్నారు. కాశీబుగ్గ ఘటన ప్రభుత్వం, నిఘా వర్గాల వైఫల్యమన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.
బైక్‌ను ఢీకొన్న కారు
పాతపట్నం: మండలంలోని పాతపట్నం – టెక్కలి రహదారి ప్రహరాజపాలేం వద్ద ఒక కారు బైక్‌ను ఢీకొనడంతో పెద్దలోగిడి గ్రామానికి చెందిన విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాన్ లంక సోమశేఖరరావుకు తీవ్రగాయాలయ్యాయని ఏఎస్‌ఐ కె.రామమూర్తి తెలిపారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన లక్కోజీ లక్ష్మణరావు కారులో బుధవారం మధ్యాహ్నం పాతపట్నం నుంచి కొత్తకోటకు పయనమయ్యారు. ప్రహారాజపాలేం వద్దకు వచ్చేసరికి ఎదురుగా ద్విచక్ర వాహనంపై పెద్దలోగిడికి చెందిన సోమశేఖరరావు వస్తుండగా అదుపుతప్పి ఢీకొన్నాడు. ప్రమాదంలో సోమశేఖరరావుకు కుడికాలు విరిగింది. దీంతో స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఏఎస్‌ఐ కె.శ్రీరామమూర్తి సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కిమ్స్ హాస్పిటల్‌లో చిన్నపిల్లల వైద్యుడు రామలింగేశ్వర్ ఏడో నెలలో పుట్టిన చిన్నారిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. పలాసకు చెందిన గర్భిణీ రేవతి ఏడో నెలలో ఉమ్మనీరు లేకపోవడంతో కిమ్స్ ఆస్పత్రికి మూడు నెలల క్రితం విచ్చేసింది. దీంతో వెంటనే రేవతిని ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయడంతో చిన్నారికి జన్మనిచ్చింది. అయితే చిన్నారి 700 గ్రాములతో పుట్టడంతో శ్వాసకోశ, ప్లేట్‌లెట్స్ తదితర సమస్యలు వచ్చాయి. దీంతో దాదాపు మూడు నెలలు అత్యాధునిక చికిత్స అందించి బుధవారం డిశార్చి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. చిన్నారి తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన


