‘తేనెటీగల దాడిపై దర్యాప్తు చేయండి’
కొరాపుట్: ఆర్‌ఎస్‌ఎస్ కవాతుపై తేనె టీగలు దాడి చేయడంపై దర్యాప్తు చేయాలని హిందూ పరివార్ సంస్థలు డిమాండ్ చేశాయి. మంగళవారం సాయంత్రం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 19వ తేదిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా కార్యకర్తలు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర మెయిన్ రోడ్డులో భారీ కవాతు జరిపారు. ఈ కవాతు చమిరియా గుడ నుంచి మజ్జి గూడ వరకు కొనసాగింది. కానీ మార్గ మధ్యంలో డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఒక్కసారిగా వందలాది తేనెటీగలు కవాతుపై దాడి చేశాయి. దాంతో సుమారు 40 మంది కార్యకర్తలు గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని హిందూ సంస్థల నాయకులు ఆరోపించారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కోశాధికారి సుశీల్ జైన్, జిల్లా ప్రచార ప్రముఖ్ విక్రం జైన్, హిందూ ఏక్తా వాహిని జిల్లా అధ్యక్షుడు గౌరీ శంకర్ సాహు, బీజేపీకి చెందిన దొయితరి మజ్జి, అడ్వకేట్ ప్రశాంత్ పట్నయక్,సంతోష్ తదితరులు ఉన్నారు.


