
ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి: రాష్ట్రపతి
భువనేశ్వర్: విద్యా సంస్థల్లో స్నాతకోత్సవం భవిష్యత్ సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కటక్ రెవెన్షా విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మంగళ వారం ఆమె విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల మేధస్సు దేశాభివృద్ధికి దోహదపడాలని సూచించారు.ఉద్యోగాలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కటక్ రెవెన్షా బాలికల ఉన్నత పాఠశాల మూడు భవనాల పునరాభివృద్ధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. వివిధ రంగాలలో విజయానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్న మహిళల నుంచి ప్రేరణ పొందాలని రాష్ట్రపతి పాఠశాల బాలికలకు సూచించారు. వారి జ్ఞానం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సంకల్పం బలంతో అసాధ్యమైన వాటిని కూడా సాధించగలరని బాలికల్ని ప్రోత్సహించారు. చిన్నారి విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి సంభాషించి, కరచాలనం చేసి మురిపించారు. భారత రాష్ట్రపతితో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్ర విద్యా విభాగం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కటక్ లోక్ సభ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి: రాష్ట్రపతి