
బాక్సింగ్ పోటీల్లో పతకాల పంట
జయపురం: అనుగూలులో జరిగిన అంతర్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలలో జయపురం బాక్సింగ్ క్రీడాకారులు పతకాల పంట పండించారు. జయపురం నుంచి పాల్గొన్న 13 మంది 16 పతకాలు సాధించి సత్తాచాటారు. వీటిలో ఏడు బంగారు, రెండు రజత, ఏడు కాంస్య పతకాలు ఉన్నట్టు స్థానిక ఇండియన్ అల్టిమేట్ ఫైట్ క్లబ్బు శిక్షకులు సాయిద్ హబిబ్ మంగళవారం వెల్లడించారు. అనుగూల్ టేబుల్ టెన్నీస్ ఇండోర్ గ్రౌండ్‌లో ఈ పోటీలు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర క్రీడా, యువ సేవా విభాగం, రాష్ట్ర అమిచూర్ కిక్ బాక్సింగ్ మహాసంఘం సంయుక్తంగా పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. స్థానిక అల్టిమేట్ ఫైట్ క్లబ్బు నుంచి 13 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. తరుణ ఖోశ్ల రెండు బంగారు, రాహుల పట్నాయక్, బిజయ సాహు, రిహాన్ ఖాన్, శేఖ్ శెహబాజ్ హుసేన్ రంజిత్ కుమార్ ఒక్కో బంగారు, అభిషేక్ దాస్, మానస నాయిక్ ఒక్కో రజత, మోహిద్ యాదవ్ రెండు కాంస్య పతకాలు సాదించగా, శేఖ్ శెహబాజ్ హుసేన్, అభిషేక్ దాస్, కె.బాహుల్య, రిహాన్ ఆలీ, ఆర్యన్ మిశ్రలు బ్రాంజ్ పతకాలు సాధించినట్టు పేర్కొన్నారు. పతకాలు సాధించిన వారిలో ఇద్దరు బాలికలు ఉన్నట్టు పేర్కొన్నారు.