
జర్నలిస్టుల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
జయపురం: జర్నలిస్టుల కోసం జయపురం సబ్‌డివిజన్ కుంద్రా సమితి కేంద్రంలో భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు కోట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ప్రకటించారు. గురువారం సాయంత్రం కుంద్రను సందర్శించిన సందర్భంగా ఆయన్ని జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు కలిసి సత్కరించారు. జర్నలిస్టు భవనానికి తగిన స్థలం ఎంపిక చేసి కేటాయించాలని ఎమ్మెల్యే రూపు భొత్ర కుంద్ర తహసీల్దార్ బినోద్ చంద్ర నాయిక్‌ను ఆదేశించారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను అమీన్, రెవెన్యూ సూపర్‌వైజర్లను స్థలం ఎంపిక బాధ్యతలను అప్పగించారు. అనువైన స్థలం గుర్తిస్తామని తహసీల్దార్ శాసనసభ్యుడుకి హామీ ఇచ్చారు. సెప్టెంబర్‌లోగా జర్నలిస్టు భవనానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన కుంద్ర సమితి ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని ఆయన జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ ప్రహరాజ్, కార్యదర్శి హరిష్ బెహర, సహాయ కార్యదర్శి సురేంద్ర సాగరియ, సలహాదారు అక్షర కుమార్ పట్నాయక్, న్యాయ సలహాదారు కనూచరణ నాయిక్, జర్నలిస్టులు వీర కిశోర్ శర్మ, బాబుల హరిజన్ ఉన్నారు.