పోలీసులకు చిక్కిన బైకుల దొంగ
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది క్రితం సారవకోట మండలం బుడితిలోని ఓ నివాసలో జరిగిన చోరీలో క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు ఆధారంగా జిల్లా పోలీసులు కీలక నిందితున్ని పట్టుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన కొర్ల శివ అలియాస్ మున్నా (23) విజయనగరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తుండేవాడు. స్థిరత్వం లేకపోవడంతో ఏ పనిచేసినా అక్కడ మానేసేవాడు. జల్సాలకు డబ్బులు లేకపోవడం, చెడు అలవాట్లు ఉండటంతో చోరీలు చేస్తేనే డబ్బులొస్తాయని నిశ్చయించుకున్నాడు. మున్నాకు బైక్‌లంటే పిచ్చి ఉండటంతో ముందుగా పార్కింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్‌గా చేసుకున్నాడు. కొన్ని వాహనాలను దొంగిలించాక.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చోరీ చేసిన బైక్‌తోనే వేరే చోటకు దొంగతనానికి వెళ్లి అక్కడికి కొద్ది దూరంలో ముందుగా తెచ్చుకున్న బైక్‌ను వదిలేసేవాడు. సమీపంలో ఉండే దేవాలయాలు, నివాస గృహాల్లో చోరీకి పాల్పడటం.. లేదంటే పార్కింగ్ చేసిన బళ్లను అక్కడి నుంచి అపహరించుకుపోవడం మున్నాకు అలవాటుగా మారింది.
పట్టుబడ్డాడిలా..
శుక్రవారం ఉదయం 10:30 గంటలకు బుడితి కమలప్రియ మోడరన్ రైస్ మిల్లు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సారవకోట పోలీసులకు నడుచుకుంటూ వస్తున్న మున్నా కనిపించాడు. పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా ఎస్‌ఐ బి.అనిల్‌కుమార్ సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. మున్నా తెచ్చుకున్న సంచిలో రెండు పాలిథిన్ కవర్లలో బంగారు, వెండి వస్తువులు గుర్తించి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లగా నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు విచారించారు. అప్పటికే సమాచారమందుకున్న అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ చంద్రమౌళిలు ఆరా తీశారు.
అనేక కేసుల్లో ముద్దాయి..
మున్నా ఫింగర్‌ప్రింట్ పరిశీలించగా ఏడాది క్రితం బుడితిలోని ఓ మహిళ నివసిస్తున్న గృహంలో జరిగిన చోరీలో మున్నాయే నిందితుడని, జిల్లాలోని అనేక పోలీస్‌స్టేషన్లలో నమోదైన 15 చోరీ కేసుల్లో ముద్దాయి మున్నానే అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఎచ్చెర్ల పీఎస్‌లో ఐదు కేసులు, జె.ఆర్.పురం, శ్రీకాకుళం టూటౌన్, సారవకోటల్లో రెండేసి చొప్పున, జలుమూరు, లావేరు, నరసన్నపేటల్లో ఒక్కటేసి, విజయనగరం జిల్లా డెంకాడలో ఒక కేసు మున్నాపై నమోదయ్యాయి. మున్నా వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువైన మూడు తులాల బంగారం, 11 తులాల వెండి, సుమారు 12 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సారవకోట పోలీసులను, సీసీఎస్ పోలీసులను ఎస్పీ అభినందించారు.
చోరీ చేసిన బైక్‌లతోనే దొంగతనాలు
దేవాలయాలు, ఇళ్లల్లో సైతం చోరీలు
వేలిముద్రలు ఆధారంగా నిందితున్ని
పట్టుకున్న పోలీసులు
పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు


