కాలి బూడిదైన పదెకరాల పంట
జయపురం: పది ఎకరాల్లో పండిన ధాన్యం చేను కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. జయపురంసబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి ఖిలోగుడ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఖిలోగుడ గ్రామంలో శివ నాయిక్ తనకున్న 10 ఎకరాల పొలంలో ధాన్యం పండించారు. పంట కోసి కళ్లంలో కుప్ప వేశాడు. అయితే సోమవారం అకస్మత్తుగా కుప్పలకు నిప్పు అంటుకుని మంటలు విస్తరించాయి. మంటలు ఆర్పేందుకు అక్కడి రైతులు ప్రయత్నించారు. అంతే కాకుండా వారు బొయిపరిగుడ అగ్ని మాపక విభాగానికి ఫోన్ చేశారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చి స్థానికుల సహకారంతో మంటలు ఆర్పారు. అయితే అప్పటికే ధాన్యం కుప్పలు కాలి బూడిదయ్యాయి. ఆ కళ్లంలో ఇతర రైతుల ధాన్యం కుప్పలు ఉన్నాయి అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇతర ధాన్యం చేను కుప్పలకు మంటలు విస్తరించకుండా ఆర్పారు.
అతిథి గృహం నుంచి
మృత దేహం స్వాధీనం
భువనేశ్వర్: స్థానిక మైత్రి విహార్ ఠాణా పోలీసులు నాల్కో చౌక్‌లోని అతిథి గృహం నుంచి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముక్కు నుంచి నురగ, నోటి నుంచి రక్తం రావడంతో సందిగ్ధత నెలకొంది. ఈ నెల 20వ తేదీన అతడి భార్య ధౌలీ పోలీస్ ఠాణాలో కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. 19వ తేదీన ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని చిట్ట చివరి సారిగా ఫోన్ చేసినట్లు పోలీసులకు వివరించింది. ఆమె ఒక యువతి పేరుతో హత్య ఫిర్యాదు నమోదైంది. సీసీటీవీని తనిఖీ చేసి యువతిని అదుపులోకి నిజాన్ని వెలుగులోకి తెస్తామని పోలీసు దర్యాప్తు బృందం అభయం ఇచ్చింది.
భక్తిశ్రద్ధలతో ధనుర్మాస వ్రతాలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణవేంకటేశ్వర ఆలయంలో పవిత్ర ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలతో పాటు వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్వామి వారికి సుప్రభాత సేవలతో పాటు విశేష అలంకరణ, హోమం, అర్చనలు కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రతాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు సేవించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరునికి పూలు, తులసీ దళాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
చిలికా సరస్సులో మునిగి పర్యాటకుడు మృతి
భువనేశ్వర్: పూరీ జిల్లా బ్రహ్మగిరి ప్రాంతం సతొపొడా సందర్శనకు వెళ్లిన పర్యాటకుడు చిలికా సరసులో మునిగిపోయాడు. చిలికా నది ముఖద్వారంలో ఈత కొడుతూ ఈ ప్రమాదానికి గురయ్యాడు. బఘొముండా తీరంలో గాలించి అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.
రాయగడలో వైఎస్ జగన్ జన్మదినోత్సవం
రాయగడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాలను స్థానిక డైలీ మార్కెట్‌లో ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎస్.సునీత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కేక్‌ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొంతమంది పేదలకు అన్నదానం చేయడంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం బాణసంచాలు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు.
కాలి బూడిదైన పదెకరాల పంట


