ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
రాయగడ: ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్ర పశుసంవర్ధక, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల మంత్రి గోకులానంద మల్లిక్ అన్నారు. కొరాపుట్‌లో ఆదివారం జరిగిన పరబ్–25 కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం స్థానిక ప్రేమ్ పహాడ్‌ను సందర్శించారు. సుమారు కిలోమీటరు దూరం గల ప్రేమ్ పహాడ్ చుట్టూ నడకను కొనసాగించిన ఆయన అనంతరం అక్కడ వాకింగ్ చేస్తున్న వారితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్, పట్టణ ప్రముఖులు ఆయనతో పలు సమస్యలు చెప్పుకున్నారు. ప్రేమ్ పహాడ్‌కు ఎంతొ మంది వాకింగ్ కోసం వస్తుంటారని వాకర్స్ క్లబ్‌కు చెందిన బ్రజసుందర్ నాయక్, సత్యవాది పతి తదితరులు వివరించారు. ప్రేమ్ పహాడ్‌ను సుందరీకరణ చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, పహాడ్ మీద యోగా గదుల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి మల్లిక్ వెంటనే కలెక్టర్ అశుతొష్ కులకర్ణికి ఫోన్ చేసి ఈ ప్రేమ్ పహాడ్ అభివృద్ధికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్లును సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రభాతి పరిడ దృష్టికి తీసుకువెళతానని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో ఈ ప్రాంతం పర్యాటక రంగంగా గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఆయన ఒక టీ దుకాణంలో కూర్చుని టీ తాగారు. అక్కడ ఉన్న జనాన్ని పిలిచి మరీ రాయగడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్, బీజేడీ హయాంలో రాయగడ జిల్లా ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాయగడపై ప్రత్యేక దృష్టిని సారించారని మంత్రి మల్లిక్ అన్నారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బ్రజసుందర్ నాయక్ మాట్లాడుతూ మంత్రి ఆకస్మికంగా ప్రజల వద్దకు చేరుకుని వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకోవడం ఇదే మొదటి సారని అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి


