కూటమి ప్రభుత్వంపై పోరాటం తప్పదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కారం చేయలేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గత ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ జీవో నెంబర్ 117 రద్దుచేసి పాఠశాల విద్య వ్యవస్థను సమూలంగా మారుస్తానని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొచ్చి ఉన్న పాఠశాలలను మూసివేసే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం పథకాలు అమలు కాక విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకపోవతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఈ.చందు తదితరులు పాల్గొన్నారు.


