మావోయిస్టు లొంగుబాటు
రాయగడ: మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించిన బిజయ్ పునేం అలియాస్ అజయ్ జిల్లా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ సమక్షంలో లొంగిపోయారు. అతని వద్ద నుంచి 9 ఎంఎం పిస్తోలు, 8 రౌండ్ల తుపాకీ గుండ్లు, వాకీటాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ స్వాతి విలేకరుల సమావేశంలో వివరాలను మంగళవారం వెల్లడించారు. అజయ్ సీపీఐ(మావోయిస్టు) గ్రూప్‌లో 2009లో చేరారు. ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న అజయ్ మావోయిస్టు నేత మోడేం బాలకృష్ణ అలియాస్ మనోజ్ వద్ద సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తుండేవాడు. అనంతరం 2014లో ఏసీఎం ర్యాంక్‌గా పదోన్నతి సాధించి మనోజ్ గన్‌మ్యాన్‌గా పనిచేశారు. 2023వ సంవత్సరంలో బీజీఎన్ డివిజన్ మావోయిస్టు దళంలో చేరారు. 2009లో ఛత్తీస్‌గడ్, 2011–2014లో మల్కన్‌గిరిలోని కొరాపుట్ ప్రాంతం, 2014–2024 వరకు నువాపడ, కలహండి, బౌధ్, మల్కన్‌గిరి కొరాపుట్ తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉండేవాడు. రాష్ట్ర ప్రభుత్వం అతడిపై రూ.4 లక్షల రివార్డును కూడా ప్రకటించింది.
జన జీవన స్రవంతిలో కలిసేందుకే...
మావోయిస్టుల కార్యకలాపాల్లో పాల్గొని నానా అవస్థలు పడ్డానని లొంగిపొయిన అజయ్ విలేకరుల సమక్షంలో చెప్పారు. సరైన ఆహారం లభించకపోవడంతో పాటు కార్యకాలపాల్లో భాగంగా సుదూర ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చిందన్నారు. భాషాపరమైన సమస్య తలెత్తడం వంటి ఇబ్బందులకు గురై మావోయిస్టుగా లొంగిపొయి జనజీవన స్రవంతిలో కలిసి జీవితాన్ని సుఖంగా గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. కాగా లొంగిపోయిన మావోయిస్టు అజయ్‌కు రీహాబిలిటేషన్ కార్యక్రమంలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఎస్పీ తెలియజేశారు. అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు.
మావోయిస్టు లొంగుబాటు


