
అంతా ఇష్టారాజ్యం!
నౌపడలో నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్
సంతబొమ్మాళి: జిల్లాలో అక్రమ లే అవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నౌపడలో అక్రమ లేఅవుట్ వెలిసింది. ఓవైపు సంబంధిత స్థలం విషయమై కోర్టులో కేసు ఉన్నా.. మరోవైపు కన్వర్షన్ చేయకుండా, పంచాయతీ అనుమతి లేకున్నా లేఅవుట్‌లోని ప్లాట్లను లక్షల రూపాయల్లో విక్రయించడానికి సిద్ధం చేసేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నౌపడలో సర్వేనెంబర్ 486–3లో 82 సెంట్లు, 486–4లో 5 సెంట్లు కలిపి మొత్తం 87 సెంట్ల విస్తీర్ణంలో ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్‌ను వేశారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
నిబంధనలకు తూట్లు..
నిబంధనల ప్రకారం లేఅవుట్ వేసేముందు వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు అధికారులు అనుమతి పొందాలి. అనంతరం ప్లాట్లు వేసేముందు ప్లానింగ్ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత అధికారులు లేఅవుట్‌లోని భూములను పరిశీలించి అనుమతులు ఇస్తారు. అలాగే సామాజిక అవసరాల నిమిత్తం 10 శాతం భూమిని పంచాయతీకి కేటాయించాల్సి ఉంది. డ్రైనేజీలు, రోడ్లు కొలతల ప్రకారం ఏర్పాటు చేయాలి. అయితే స్థానికంగా అవేమీ కనిపించడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్‌లో ప్లాట్లు అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం.
కోర్టులో కేసు..
సర్వే నెంబర్ 485–3 సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిలో తనకు అన్యాయం చేశారని పలికిల శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పత్రాలను సైతం రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ పరిస్థితిలో లేఅవుట్ ఎలా వేశారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.
కన్వర్షన్ చేయలేదు..
లేఅవుట్ ఏర్పాటు చేసే ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కన్వర్షన్ అయ్యాకే లేఅవుట్ పనులు ప్రారంభించాలి. నౌపడలో సర్వే నెంబర్ 486–3,4లో కన్వర్షన్ కోసం దరఖాస్తు చేయలేదు. కోర్టు పరిధిలో ఉంటే సంబంధిత పత్రాలు తహసీల్దార్‌కు అందజేయాలి.
– ముంగులు, వీఆర్వో, నౌపడ
అనుమతులు లేవు..
నౌపడలో వేసిన లేఅవుట్లకు ఎటువంటి పంచాయతీ అనుమతులు లేవు. ఇంతవరకు పంచాయతీ అధికారులను ఎవరూ సంప్రదించలేదు. – యు.ఉమాపతి,
పంచాయతీ కార్యదర్శి, నౌపడ
నౌపడలో అక్రమ లేఅవుట్
కోర్టులో కేసు ఉన్నా.. అనుమతులు లేకపోయినా అమ్మకానికి సిద్ధం