
మురపాకలో నాలుగు పూరిళ్లు దగ్ధం
ఎచ్చెర్ల: లావేరు మండలం మురపాకలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గార రాములమ్మ, లావేటి లక్ష్మీ, మామిడి ఈశ్వరరావు, లావేటి రాములమ్మలకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామాన్లు, రూ.70 వేలు నగదు, బంగారం కాలిపోయాయి. అందరూ ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ముందుగా లావేటి రాములమ్మ ఇంటివద్ద మంటలు చెలరేగి వరుసగా ఉన్న ఇల్లు కాలిపోయాయి. స్థానిక యువత స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపుచేశారు. లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ప్రతినిధి పెయ్యిల లక్ష్మణరావు నాలుగు ప్యాకెట్లు బియ్యం, రూ.2 వేలు తక్షణ సహాయం అందించారు. ఎంపీటీసీ ప్రతినిధి తేనెల సురేష్, స్థానిక నాయకులు మడ్డి కనకయ్య, జల్లేపల్లి శారది తదితరులు సహాయక చర్యలు చేపట్టారు.