
అవి వైఎస్సార్ సీపీ హయాంలో వచ్చిన నిధులు
● ఎమ్మెల్సీ రామారావు
కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో ఇటీవల కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని, ఈ పనుల నిధులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చినవేనని ఎమ్మెల్సీ నర్తు రామారావు గుర్తు చేశారు. మండల కేంద్రం కంచిలిలో గల ఎమ్మెల్సీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోంపేట మండలం బారువ కొండిరేవ బ్రిడ్జికి రూ.3కోట్ల 45 లక్షలు, మహేంద్రతనయ బ్రిడ్జికి రూ.14 కోట్ల 60లక్షలు, ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు నుంచి పెద్దలక్ష్మీపురం వరకు రూ.4కోట్ల 86లక్షలు ప్రధాన మంత్రి సడక్‌యోజన కింద తారు రోడ్డు వేయడానికి, బూర్జపాడు ఉప్పుటేరుపై రూ.10కోట్ల 50లక్షలతో వంతెన నిర్మాణానికి ఆనాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి, టెండర్లు పిలిచి, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ పనులు తాత్కాలికంగా ఆగాయని అన్నారు. ఈ పనులు తామే తెచ్చామని కూటమి నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నా.. నిజానికి ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీలు పైల దేవదాస్‌రెడ్డి, డాక్టర్ నిమ్మన దాస్, బోర పుష్ప, కంచిలి జెడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, పార్టీ నేతలు నర్తు నరేంద్రయాదవ్, ఇప్పిలి కృష్ణారావు, తడక జోగారావు, దుర్గాసి ధర్మారావు, నర్తు ప్రేమ్‌కుమార్, డొక్కరి బలరాం, మడ్డు వెంకటరావు, కొత్తకోట శేఖర్, బల్లెడ సుమన్, గణప సింహాచలం, రాంపత్ని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.