● జూన్ 2 నుంచి బురదల పోలమ్మ ఉత్సవాలు
రాయగడ: జూన్ 2వ తేదీ నుంచి జరగనున్న గ్రామదేవత బురదల పోలమ్మ అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాల ప్రారంభానికి ప్రధాన ఘట్టమైన ముహూర్తపు రాట కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బార్జి జగన్‌మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు ఎద్దు శ్రీహరి, కోశాధికారి బొత్స శ్రీనివాస్‌రావు, పట్టణ ప్రముఖులు శిల్లా జగన్నాథరావు, ముంజేటి గంగాధర్‌రావు, చిన్నారి విజయ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయ ఆదివాసీ వాయిద్యాల నడుమ ముహూర్తపు రాట కార్యక్రమం జరిగింది. దీంతో ఉత్సవాల పనులకు శ్రీకారం చుడతారు.
చాటింపు
అమ్మవారి ఉత్సవాలు ప్రారంభానికి ముందు పట్టణంలో చాటింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈనెల 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు చాటింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ చాటింపు విన్నవారు ఉత్సవాలు ముగింపు రోజున తప్పనిసరిగా ఉండాలన్నది ఇక్కడి నమ్మకం. అదేవిధంగా పట్టణ ప్రజలు సాంప్రదాయాన్ని కొనసాగిస్తుండడం విశేషం.
ఉజ్జిడి బండి
జూన్ 1వ తేదీన ఉజ్జిడి బండి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వెదురుతో తయారైన బుట్టను ఒక చిన్న బండిపై ఉంచి తెల్లవారుజామున బండిని లాగుకుంటూ వెళ్తారు. ఆ సమయంలో చద్ది అన్నం బుట్టలో వేస్తారు. దీంతో పట్టణం చల్లగా ఉంటుందని ఒక నమ్మకం.
అమ్మవారి పాదాలు
ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పాదాలు తీసుకువచ్చే కార్యక్రమం జూన్ 2వ తేదీ సాయంత్రం ప్రారంభమవుతుంది. స్థానిక భైరవీధిలోని దొర ఇంటి నుంచి పాదాలను తీసుకొచ్చి అమ్మవారి మందిరంలో ఉంచుతారు. దీంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారి పాదాలను ప్రత్యేకంగా మెయిన్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మండపానికి అమ్మవారి మందిరం నుంచి తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం 8వ తేదీన నీలధార, అదేరోజు రాత్రి ఉయ్యాల కంబాల, 9వ తేదీన అసర్లు, అదేరోజున నాయుడు, నాయురాళ్ల వేషధారణ, 10న అసర్లు, 11వ తేదీన ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.
ఉత్సవాలకు అంకురార్పణ